Begin typing your search above and press return to search.

సైబర్‌ నేరాలకు ప్రత్యేక కోచింగ్‌ సెంటర్లు.. ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   13 Oct 2021 11:30 AM GMT
సైబర్‌  నేరాలకు ప్రత్యేక కోచింగ్‌ సెంటర్లు.. ఎక్కడంటే !
X
చదువు అన్నింటికి ప్రధానంగా భావిస్తారు. కానీ, కొందరు పదో తరగతి ఫెయిలయ్యారు. మరికొందరు ఏడో తరగతితోనే ఆపేశారు. కంప్యూటర్‌ గురించి కనీస అవగాహన లేదు. అయితేనేం వేల మందికి సైబర్‌ టోపీ ఎలా పెడుతున్నారు అనే ప్రశ్న రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనికి సమాధానం కనుక్కునే ప్రయత్నంలో ఉండగా ఝార్ఖండ్‌ దేవగఢ్‌ జిల్లాలోని పలు పట్టణాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను అక్కడి ఇన్‌ఫార్మర్లు చూపించడంతో అవాక్కయ్యారు. మోసాలెలా చేయాలి , బ్యాంక్‌ అధికారులుగా ఎలా మాట్లాడాలి, ఉత్తుత్తి ముఖాముఖిలు ఎలా నిర్వహించాలి, తదితర అంశాలపై వాటిలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యారు.

16 కేసుల్లో నిందితులుగా ఉన్న పది మంది దేవగఢ్‌ ముఠా సభ్యులను రాచకొండ సైబర్‌క్రైమ్స్‌ దర్యాప్తు బృందం సోమవారం నగరానికి తీసుకు వచ్చి రిమాండ్‌ కు తరలించింది. దర్యాప్తు బృందం దృష్టికి వచ్చిన అంశాలు అందరినీ నివ్వెరపరిచేలా ఉన్నాయి. దేవగఢ్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో దాదాపుగా ఇంటికో సైబర్‌ నేరస్థుడు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొందరు తల్లిదండ్రులు కూడా అటువైపు ప్రోత్సాహిస్తున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వీరిలో చాలామంది ఓ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా పనిచేస్తుండటం గమనార్హం. పొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్‌ నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఒకేసారి 500 సిమ్‌ కార్డులు తెచ్చుకుంటున్నారు.

ఒకరిని మోసం చేయగానే ఆ సిమ్‌ కార్డును పక్కన పారేస్తున్నారు. ఫలానా చోట నిందితులున్నట్లు మన పోలీసులు గతం లో టవర్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించి అక్కడి పోలీసులకు చెప్పారు. అక్కడికెళ్లేసరికి నిందితులు కనిపించలేదు. ఇదే అనుభవం నాలుగైదు సందర్భాల్లో ఎదురైంది. దీనితో అక్కడి పోలీసులకు చెప్పకుండానే మరో చోటుకు వెళ్లగా అక్కడ నిందితులు చిక్కారు. దీనితో పోలీసులు మోసగాళ్లకు సహకరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఒక్కో ముఠాలో కనీసం 20మంది వరకు ఉంటారని తొలుత పోలీసులు భావించారు. వాస్తవానికి నలుగురే ఉంటున్నారు. ఇద్దరు కంప్యూటర్లను ఆపరేట్‌ చేస్తుంటే, మరో ఇద్దరు ఫోన్ల ద్వారా అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఒక్కో ముఠా వద్ద వందకుపైగా బ్యాంక్‌ ఖాతాల వివరాలుంటాయి.

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు దోచుకున్న సొత్తును అప్పటికప్పుడు ఆ ఖాతాలకు ఒక్కో దాంట్లోకి రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున బదిలీ చేస్తుంటారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు ఫోన్‌చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకుని రమ్మని చెబుతున్నారు. వారికి కమిషన్ ఇస్తుంటారు. ప్రతి ముఠావద్ద ఒక్కో మోసానికి సంబంధించి ఆంగ్లం, హిందీలో రాసిన స్క్రిప్టులు ఉంటాయి. ఈ స్క్రిప్ట్‌ ను కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు ఇస్తున్నారు. మోసగాళ్లు అందులో ఉన్నట్లే మాట్లాడుతున్నారు. అదనంగా మాట కూడా మాట్లాడరు. మొదటి దోచుకున్న సొత్తును గురుదక్షిణగా కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు అందజేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు