Begin typing your search above and press return to search.

బాబు ఓకే చేసిన అసెంబ్లీ డిజైన్ ప్ర‌త్యేక‌త‌లివే!

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:53 AM GMT
బాబు ఓకే చేసిన అసెంబ్లీ డిజైన్ ప్ర‌త్యేక‌త‌లివే!
X
జ‌నం చెప్పిన డిజైన్ ను ఓకే చేస్తామ‌ని చెప్పినా.. ఏపీ ముఖ్య‌మంత్రి మ‌న‌సు ప‌డ్డ డిజైన్‌ కు అన‌ధికారికంగా ఓకే చెప్పేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించే అసెంబ్లీ భ‌వ‌న డిజైన్ కు సంబంధించి కిందామీదా ప‌డిన త‌ర్వాత‌.. చివ‌ర‌కు సూది మొన‌లాంటి ట‌వ‌ర్ ఉండే భ‌వ‌న డిజైన్‌ కు బాబు ఫిదా అయ్యారు. ముఖ్య‌మంత్రుల వారి నోటి నుంచి బాగుంద‌న్న మాట వ‌చ్చిన‌ త‌ర్వాత నేత‌ల గ‌ణం కావొచ్చు.. అధికారులు కావొచ్చు.. ఇంకేం చెప్ప‌గ‌ల‌రు. అంత పెద్ద జ‌క్క‌న్న ఇచ్చిన స‌ల‌హాల్నే చంద్ర‌బాబు లైట్ తీసుకున్న వేళ‌.. ఆయ‌న‌కు న‌చ్చిన డిజైన్‌ ను కాకుండా వేరే డిజైన్‌ ను ఓకే చేసే ద‌మ్ము.. ధైర్యం ఎవ‌రికి ఉంటుంది మ‌రి.

సో.. ఎవ‌రు అవున‌న్నా.. కాదన్నా బాబు మ‌న‌సు ప‌డ్డ సూదిమొన‌లాంటి ట‌వ‌ర్ ఉన్న భ‌వ‌న‌మే ఏపీ అసెంబ్లీ అన్న‌ది ఇక రాసేసుకోవ‌చ్చు. 2019 మార్చి నాటికి ఈ భ‌వ‌నాన్ని సిద్ధం చేయాల‌ని అనుకుంటున్నారు. అంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఒక‌ట్రెండు నెల‌లు.. లేదంటే ఆ టైంకి అసెంబ్లీ భ‌వ‌నం దాదాపుగా సిద్ధం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట‌.

ఇదిలా ఉంటే.. బాబు మ‌న‌సు మెచ్చిన ఈ నిర్మాణంలో ప్ర‌త్యేక‌త‌లు ఏమిట‌న్న‌ది చూస్తే.. చాలానే ఉన్నాయ‌ని చెప్పొచ్చు

చ‌తుర‌స్రాకారంలో ఉండే భ‌వ‌నంలో తెలుగువారి ఘ‌న‌చ‌రిత్ర‌.. సంస్కృతి.. వార‌స‌త్వాన్ని క‌ల‌బోస్తూ రూపొందించ‌నున్నారు. ఇక‌.. మెడ్ర‌న్ గా ఉండేందుకు ట‌వ‌ర్ సింబ‌ల్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. సూదిమొన ఆకృతిలో ఉండే భ‌వ‌నం ఎత్తు.. ట‌వ‌ర్ తో క‌లిపి 250 మీట‌ర్లు ఉండ‌నుంది. వెడ‌ల్పు కూడా అంతే ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక‌.. చుట్టూ ఉన్న త‌టాకంలో ఈ ట‌వ‌ర్ ప్ర‌తిబింబం క‌నిపించటం అంద‌రిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంద‌ని చెబుతున్నారు.

ఈ ట‌వ‌ర్ లో 70 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ సంద‌ర్శ‌కులు వెళ్లే అవ‌కాశం క‌ల్పిస్తారు. అక్క‌డో వ్యూ ప్లేస్‌ను ఏర్పాటు చేస్తారు. అక్క‌డి నుంచి చూస్తే అమ‌రావ‌తి న‌గ‌రం మొత్తం క‌నిపిస్తుంది. చ‌తుర‌స్రాకార‌పు భ‌వ‌నం కుడ్యాల‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అంద‌జేసి త్రీ డైమెన్ష‌న్ చిత్రాలు పెద్ద ప‌రిమాణంలో క‌నిపించేలా తీర్చిదిద్దుతారు. నాలుగు ప‌క్క‌ల నుంచి చూస్తే ఉద‌యిస్తున్న సూర్యుడు.. పురివిప్పిన నెమ‌లి.. బౌద్ధ‌చ‌క్రం.. నాట్యం.. సంగీతం.. మూల‌ల నుంచి చూస్తే ఏనుగు.. లేపాక్షి బ‌స‌వ‌న్న‌ల‌తో ఆంధ్రుల శిల్ప సంద‌ప‌ను తెలిపేలా చిత్రాలు కనిపిస్తాయి.

అసెంబ్లీ భ‌వ‌నంలో సెంట్ర‌ల్ హాట్లో రాజ‌మౌళి సూచ‌న మేర‌కు తెలుగు త‌ల్లి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తారు. సూర్య కిర‌ణాల వెలుగులో ఆ విగ్ర‌హం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతారు. సో.. రానున్న రోజుల్లో ఆంధ్రుల అసెంబ్లీ భ‌వ‌నం ఎలా ఉంటుందో ఇప్పుడు కాస్తంత క్లారిటి వ‌చ్చిన‌ట్లేన‌ని చెప్పాలి.