Begin typing your search above and press return to search.

అంతర్వేది ఎఫెక్ట్: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలపై ప్రత్యేక నిఘా

By:  Tupaki Desk   |   12 Sep 2020 10:50 AM GMT
అంతర్వేది ఎఫెక్ట్: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలపై ప్రత్యేక నిఘా
X
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవడం, చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రం లోని ముఖ్యమైన ఆలయాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. బందోబస్తు పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఆయా ఆలయాల ఈవోల తో పోలీసు అధికారులు సమావేశమై తగు సూచనలు ఇస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయ రథానికి ఏకంగా ఇన్స్యూరెన్స్ కూడా చేయించారు.

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న రథాన్ని , అలాగే ఆలయ అనుబంధ ఆలయాలైన కుంకుళ్ళమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురం లోని జగన్నాథ స్వామి వారి రథాన్ని భీమడోలు సీఐ సుబ్బారావు, ద్వారకా తిరుమల ఇంచార్జి ఎస్ఐ శ్రీహరి రావు పరిశీలించారు. భద్రత పై ఆలయాల అధికారుల తో చర్చించారు. అంతర్వేది ఘటన తో ముఖ్యం గా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయాల పై పోలీసులు దృష్టి సారించారు.

భీమవరం లోని సోమేశ్వర జనార్ధన స్వామి రథం, ఆచంట లోని ఆచంటేశ్వర స్వామి రథం, అత్తిలి మదన గోపాల స్వామి రథం, దువ్వ వేణుగోపాలస్వామి రథం, కామవరపు కోట లోని వీరభద్ర స్వామి రథంలతో పాటు ముఖ్యమైన ఆలయాల్లోని రథాలపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యమైన ఆలయాల వద్ద హోంగార్డులు విధులు నిర్వర్తిస్తుండగా, చాలా ఆలయాల వద్ద ఫ్లడ్లైట్లు కూడా ఏర్పాటు చేశారు. అంతర్వేది రథం దగ్ధమైన నేపథ్యంలో చిన్న వెంకన్న దేవస్థానం అధికారులు యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ద్వారా మూడు రథాలకు 40 వేలతో ఇన్స్యూరెన్స్ చేయించారు. ద్వారకా తిరుమల ఆలయానికి చెందిన మూడు రథాలను ప్రత్యేకంగా నిర్మించిన ఆర్ సీసీ రూఫ్ కలిగిన రథ శాలల్లో భద్రపరుస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు తెలిపారు.