Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా... జగన్ చేతికి బ్రహ్మాస్త్రం.. ?

By:  Tupaki Desk   |   16 Dec 2021 3:47 PM GMT
ప్రత్యేక హోదా... జగన్ చేతికి బ్రహ్మాస్త్రం.. ?
X
ప్రత్యేక హోదా. ఈ మాట ఏడేళ్ళుగా నలుగుతోంది. మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ ఇంకా పాత పాటగా, అలవి కానీ హామీగా దాన్ని ఢిల్లీ పాలకులు చూపిస్తున్నారు. ముగిసిన అధ్యాయమని కూడా ఏపీ ముఖాన చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా అన్నది కేవలం రాజకీయ దినుసుగా మాత్రమే ఉపయోగపడుతుందని ఏపీలోని రాజకీయ పార్టీలు భావించేదాకా కధ సాగిపోయింది. అయితే హోదాకు ఉందిలే మంచి కాలమని ఒక ఆశావహమైన సంకేతం ఇపుడు కనిపిస్తోంది.

నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నోట ప్రత్యేక హోదా మాట వచ్చింది. ఆయన ఏపీ గురించి చెప్పలేదు. బీహార్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం ఇక్కడ విశేషం. బీహార్ గత దశాబ్ద కాలంలో ఎంతో అభివృద్ధి సాధించినా కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా ముందుకు సాగేందుకు ఇతోధిక సాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రం నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదాను కూడా పరిశీలిస్తామని ఆయన చెప్పడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక బీహార్ కి ప్రత్యేక హోదాని ఇచ్చే వీషయంలో నీతి అయోగ్ చేసిన ఈ కీలక వ్యాఖ్యల నేపధ్యంలో అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసారు. మరో వైపు ఆర్జేడీ ఎంపీలు కూడా రాజ్యసభలో బీహార్ కి ప్రత్యేక హోదా మీద చర్చించాలని డిమాండ్ చేయడం విశేషం. బీహార్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం ఏపీకి చాలా సానుకూల అంశమని అంటున్నారు.

ఇప్పటికే హోదా విషయంలో కేంద్రం అనేక రకాలుగా మాటలు మాట్లాడింది. 14వ ఆర్ధిక సంఘం హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని చెప్పిందని కూడా పేర్కొంది. కానీ అటువంటిది ఏదీ ఆ సంఘం చెప్పలేదని ఏపీ రాజకీయ పార్టీలు నాడే ఖండించాయి. ఇదిలా ఉంటే హోదా ఇక అసాధ్యం, ఏ రాష్ట్రానికి కూడా ఇచ్చే సీన్ ఉండదని కేంద్రం పదే పదే చెబుతున్న వేళ నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ హోదాలో రాజీవ్ కుమార్ బీహార్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా విశేషమే అని చెప్పాలి.

అంటే ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అయితే కాదని దీని వల్ల తేలుతోంది. అదే సమయంలో పట్టు పడితే, రాజకీయంగా అంతా ఒక్కటిగా గట్టి సంకల్పం చెస్తే కచ్చితంగా ఏపీకి హోదా వచ్చి తీరుతుందందన్నది అర్ధమవుతోంది. మరి ఆ పని చేయాల్సింది ముఖ్యమంత్రి వైఎస్ జగనే. ఆయనకు ఇపుడు ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఇచ్చేశారు.

అంతే కాదు ఈ మధ్యనే ఏపీకి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి జగన్ని కలసి ఏపీలో అమలు జరుగుతున్న కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక విధంగా ఇది కూడా ఏపీకి మంచి చేసే పరిణామమే. బీహార్ ఎలా ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేదని రాజీవ్ కుమార్ అన్నారో ఏపీ కూడా అంతకు మించి ఇబ్బందులో ఉందని గుర్తు చేయాలి. ఏపీ విభజన గాయాలని ఒకటికి పది సార్లు ప్రస్థావించి అయినా జగన్ ఏపీకి హోదాను సాధించుకుని రావాలని అంతా కోరుతున్నారు.

ఒకవేళ ఈ విషయంలో జగన్ కనుక అడుగులు ముందుకు వేయకపోతే ఏపీలోని ప్రతిపక్షాలకు అది అద్భుతమైన ఆయుధంగా మారుతుంది. 2019 ఎన్నికల వేళ జగన్ ఏ హోదాను అయితే అడ్డం పెట్టుకుని 22 మంది ఎంపీలని గెలిపించుకున్నారో ఇపుడు అది రివర్స్ అయినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ ఇపుడు కదలాలి. వైసీపీ పార్లమెంట్ ని స్టాల్ చేసినా ఏపీకి హోదా విషయంలో తేల్చుకోవాలి. ఒక విధంగా ఇది చక్కని అవకాశం. మరి జగన్ ఆ విధంగా చేస్తారనే అంతా కోరుకుంటున్నారు.