Begin typing your search above and press return to search.

అమెరికాలో ఎన్నికలు .... తమిళనాడులో పూజలు, ఏంటీ సంబంధం !

By:  Tupaki Desk   |   3 Nov 2020 10:50 AM GMT
అమెరికాలో ఎన్నికలు .... తమిళనాడులో పూజలు, ఏంటీ సంబంధం !
X
అమెరికా ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంది. విజయం కోసం ట్రంప్, జో బిడెన్ విశ్వప్రయత్నాలు చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలతో హీటేక్కిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ డెమోక్రటిక్స్ తరుపున ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ కోసం తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమలా హరిస్ తల్లి శ్యామల గోపాలన్ స్వస్థలం అయిన తిరువారూర్ లో అయితే కమలా గెలవాలని అభిలషిస్తూ వీధి వీధినా కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

మన్నార్ గుడి లోని కులచెందినపురం అయ్యనార్ స్వామి ఆలయానికి ఆనాదిగా తమల హరిస్ కుటుంబం విరాళాలు ఇస్తూ వస్తోంది. దీంతో ఆ దేవాలయం లో ఈ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు స్థానికులు. ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని..అందుకే ఆమె కోసం పూజలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. తల్లి ఇండియన్ తండ్రి ఆఫ్రికన్ కావడంతో రెండు దేశాల సంప్రదాయాలు కమలా హ్యారిస్‌ లో కనిపిస్తాయి. కాలిఫోర్నియాలో ఇండో ఆఫ్రికన్ అమెరికన్ ‌గా పుట్టిన కమలా హ్యారిస్ డెమొక్రటిక్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. తల్లి శ్యామలా గోపాలన్‌తో కలిసి అనేకసార్లు చెన్నై వచ్చారు. తన పేరులోనే కమలం ఉందని, భారతీయ సంప్రదాయాల్లో దానికి ఎంతో విలువ ఉందంటూ ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు కమలా.

గతేడాది వరకు కమలా.. అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొమొక్రటిక్ పార్టీ నుంచి నామినేషన్ పొందేందుకు కమలా హ్యారిస్ తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే పార్టీ అంతర్గత డిబేట్స్‌ లో జో బైడెన్ కంటే వెనుకపడ్డారు. డెమొక్రటిక్ పార్టీలో తనతో పోటీపడిన, కమలా హ్యారిస్‌కే ఉపాధ్యక్ష పదవి కట్టపెట్టాలని నిర్ణయించుకున్నారు జో బైడెన్. ఇక అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్, జొ బిడెన్ లు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే అగ్రరాజ్యం అమెరికాకి కొత్త అధ్యక్ష్యుడిగా జో బిడెన్ ఎన్నికవనున్నారు.