Begin typing your search above and press return to search.

వేటు పడినంతనే పీకేకు భారీ ఆఫర్

By:  Tupaki Desk   |   31 Jan 2020 1:30 AM GMT
వేటు పడినంతనే పీకేకు భారీ ఆఫర్
X
అధికార పార్టీకి చెందిన ఒక నేతపై పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి బహిష్కరణ వేటు వేసిన రెండు రోజుల వ్యవధిలోనే.. విపక్షానికి చెందిన కీలక నేత ప్రకటన చేయటం ఎప్పుడైనా చూశామా? ఎక్కడైనా విన్నామా? కానీ.. తాజాగా బిహార్ రాజకీయం చూస్తే ఇలాంటిదే కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిశోర్ ది కాస్త భిన్నమైన వ్యవహారం. ఆచితూచి అన్నట్లుగా తాను మద్దతు ఇవ్వాల్సిన పార్టీని ఎంపిక చేయటం.. సదరు పార్టీని అధికారంలోకి తీసుకురావటం టాస్క్ ను తీసుకుంటే.. దాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకూ వదిలిపెట్టరు. ఇలా చేస్తూనే.. ఆయన బిహార్ అధికారపక్షం జేడీయూలో కీలక నేతగా ఎదిగారు.

ఇలాంటివేళలోనే నితీశ్ కు పీకేకు మధ్య మాటల యుద్ధం ముదరటం.. అది అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇది కూడా పాత వార్తే. కాకుంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ను తమవైపు తిప్పుకునేందుకు విపక్ష ఆర్జేడీ తన ప్రయత్నాల్ని షురూ చేసింది.

ప్రశాంత్ కిశోర్ ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆ పార్టీ ముఖ్యనేత కమ్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు పీకేను ఆర్జేడీలోకి తీసుకొచ్చేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా అధికార పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన ఒక నేత కోసం ఇంత డిమాండ్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అని మాత్రం చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పీకే లాంటి మాస్టర్ మైండ్ తమ పార్టీలోకి వస్తే.. ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవటం ఖాయమన్నది ఆర్జేడీ ఆలోచనగా చెబుతున్నారు. మరి.. ఆ పార్టీ ఆఫర్ కు పీకే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.