Begin typing your search above and press return to search.

తిరుమల సంప్రదాయ భోజనం మెనూ ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? లోగుట్టు ఇదేనా?

By:  Tupaki Desk   |   27 Aug 2021 3:34 AM GMT
తిరుమల సంప్రదాయ భోజనం మెనూ ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? లోగుట్టు ఇదేనా?
X
తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తుల కోసం ఉచిత భోజన సదుపాయం గురించి తెలిసిందే. దీనితో పాటుగా రానున్న రోజుల్లో సంప్రదాయ భోజనాన్ని అందించేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంప్రదాయ భోజనం ప్రత్యేకత ఏమంటే.. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన వస్తువులతోనే వీటిని సిద్ధం చేస్తారు. అయితే.. దీన్ని ఉచితంగా అందించరు. కాస్ట్ టు కాస్ట్.. అంటే ఈ మీల్ ను తయారు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో.. అంత ఖర్చును వసూలు చేస్తారు. అంటే.. లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేయటమన్న మాట.

ఎందుకిలా? అన్న ప్రశ్న తలెత్తొచ్చు. ఇప్పటికే ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. దీనికి మంచి పేరు ఉంది. ఉచితంగా అందించే భోజనంలో వడ్డించే వస్తువుల సంఖ్య తక్కువే అయినా.. దాని రుచి చాలాబాగుండటంతో.. చాలామంది భక్తులు తప్పనిసరిగా స్వామి వారి ఉచిత భోజనాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. దీని భారం అంతకంతకూ ఎక్కువైపోతున్న నేపథ్యంలో.. సరికొత్తగా టీటీడీ సంప్రదాయ భోజనం కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చింది.

ఈ భోజన మెనూలో అన్నం.. కొబ్బరి అన్నం.. పులిహోరా.. పప్పు.. సాంబార్.. రసం.. పూర్ణాలు.. పచ్చడి.. పెరుగు..నెయ్యి ఇలా మొత్తం పద్నాలుగు వెరైటీలు ఉంటాయని చెబుతున్నారు. టిఫిన్ కింద బోండా..వడ.. ఉప్మా.. ఇడ్లీను వడ్డిస్తారని చెబుతున్నారు. దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో మెనూను సిద్ధం చేస్తారు. కాలాబాత్బియ్యంతో ఉప్మా.. కులంకార్ బియ్యంతో ఇడ్లీని సిద్దం చేస్తారు.

వ్యాధి నిరోధకతను పెంచే పోషకాలు బోలెడన్ని ఉంటాయని చెబుతున్నారు. గురువారం మొదలు పెట్టిన ఈ సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా కొందరు భక్తులకు అన్నమయ్య భవన్ లోనూ వడ్డిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఉచితంగా అందిస్తూ.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో దీన్ని పడిన రేటుకు అమ్ముతారని చెబుతున్నారు. చూస్తుంటే.. ఉచిత భోజనం భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు వీలుగా ఈ ఆకర్షణీయమైన ప్లాన్ ను టీటీడీ సిద్ధం చేసి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యం మీద అవగాహన అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఈ కాన్సెప్టు అందరిని ఆకర్షించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.