లిక్కర్ కింగ్ పీచమణిపించేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయి ఇంగ్లండ్ దేశంలో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇందుకోసం ఇటీవల ఈడీ అధికారులు ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెస్స్ ను ప్రయోగించింది. పరారీలో ఉన్న నేరస్థుడిగా గుర్తించాలని కోరుతూ ఈడీ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించింది. దీనిపై విచారించిన కోర్టు విజయ్ మాల్యాకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 27లోగా మాల్యా కోర్టులో హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.
మాల్యా గనుక రాకపోతే అతడిని ‘పరారీలో ఉన్న నేరస్థుడిగా’ ప్రకటిస్తామని.. అంతేగాక మాల్యాకు చెందిన రూ.12500 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆస్తుల్లో స్థిరాస్తులతో పాటు షేర్లు కూడా ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఇటీవలే అమల్లోకి వచ్చిన ప్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ ఆర్డినెస్స్ ను ఈడీ ప్రయోగించింది. ఏప్రిల్ లో ఈ కొత్త ఆర్డినెస్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం పారిపోయిన వ్యక్తుల ఆస్తుల్ని ఇక్కడ జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది.
కాగా విజయ్ మాల్యాను నేరస్థుడిగా ప్రకటించడంతో పాటు అతని మొత్తం ఆస్తి 12500 కోట్లను జప్తు చేసుకునేందుకు అనుమతి కోరుతూ ముంబై కోర్టులో ఈడీ గతవారం పిటీషన్ వేసింది. ఈ మేరకు కోర్టు తాజాగా మాల్యాకు డెడ్ లైన్ విధించి రాకపోతే ఆస్తుల స్వాధీనానికి అవకాశం ఇచ్చింది.