Begin typing your search above and press return to search.

జగన్ శ్రీరాముడు... అతి పొగడ్త ఎవరిదంటే...?

By:  Tupaki Desk   |   20 March 2023 9:24 PM GMT
జగన్ శ్రీరాముడు... అతి పొగడ్త ఎవరిదంటే...?
X
విధేయతతో వీర విధేయత ఉంటుంది. ఇది కొన్ని సార్లు ఎబ్బెట్టుగా కూడా మారుతుంది. ఎవరైనా తమ నాయకుడిని కొనియాడడం సహజం. ఎందుకంటే పార్టీల రాజకీయాలలో ప్రజాస్వామ్యం కంటే వ్యక్తిస్వామ్యం ఎక్కువ. నాయకుడిని పొగిడితే చాలు పని జరుగుతుంది అన్నదే ఉంటుంది. ఇలా పొగిడేవారు రాజకీయంగా జూనియర్లు ఉంటారు. కొందరు సీనియర్లు అదే విధంగా పొగిడితే ఏమనుకోవాలన్నదే ప్రశ్న.

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం జగన్ని పొగడడంతో ఎపుడూ తగ్గేది లేదు అన్నట్లుగానే ఉంటారు. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన చూడని అధికారం పదవులు లేవు. ఏడు పదుల వయసులో తమ్మినేని స్పీకర్ గా అత్యున్నత చట్టసభకు బాధ్యత వహిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో ఈ సోమవారం జరిగిన ఒక ఘటన నేపధ్యంలో తెలుగుదేశం సభ్యులు తన పోడియం వద్దకు రావడం తన పక్కనే నిలబడి పేపేర్లు విసరడం వంటి వాటి మీద ఒక విధంగా రియాక్ట్ అయ్యారు.

అది స్పీకర్ గా ఆయన రెస్పాన్సిబిలిటీ. ఆయన రియాక్ట్ కావడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆయన ఈ సందర్భంగా అన్న మాటలు కొంత ఆసక్తిని గొలిపేలా ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు నన్ను కుర్చీలో నుంచి తోసేయడానికి ప్రయత్నించి పేపర్లు నాపైకి విసిరారు. నేను బుద్ధుడిని కాను, శ్రీరాముడితో సమానమైన మన ముఖ్యమంత్రి నన్ను రక్షించడానికి ఉన్నారని, దుష్టశక్తుల నుండి అసెంబ్లీని, రాష్ట్రాన్ని కూడా రక్షిస్తారని తమ్మినేని అన్నారు.

ఇది నిజంగా అతిగా అనిపించిన పొగడ్త గానే అంతా చూస్తున్నారు. పైగా అతికీ అతకని విధంగా ఉందని అంటున్నారు. అసెంబ్లీలో టీడీపీ వారిని ఉద్దేశించి ఆయన రావణసేనతో పోల్చడం కూడా అంత సబబుగా తోచినట్లుగా లేదని అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలే రచ్చగా మారిపోయాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుండగా వైసీపీ ఎమ్మెల్యేలు వారిపైకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది.

ఇక్కడ తమ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు వేంపల్లి, సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడంతో పాటు గొడవపై స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలను తప్పుబట్టిన తమ్మినేని అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇక నుంచి స్పీకర్ పోడియం వద్దకు ఎవరు చేరుకున్నా, వారు ఆటోమేటిక్ గా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడతారు అని రూలింగ్ కూడా ఇచ్చారు.

ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినా స్పీకర్ స్పందించలేదని విమర్శలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి. మరో వైపు చూస్తే స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తోసేశారు. బ్యాలెన్స్ కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే నేలపై పడగా, వైసీపీ ఎమ్మెల్యే వేంపల్లి టీడీపీకి చెందిన బుచ్చయ్య చౌదరి నుంచి ప్లకార్డులు లాక్కున్నారు. ఈ కార్యక్రమాలను నిశితంగా పరిశీలించిన స్పీకర్ తమ్మినేని నోరు మెదపలేదని పైగా జగన్ని శ్రీరాముడు అంటూ కితాబు ఇవ్వడమేంటి అంటున్నారు. ఇది హద్దులు దాటిపోయిన కితాబుగానే ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.