Begin typing your search above and press return to search.

ఆ పాపంలో నేనూ భాగస్వామినే..స్పీకర్ సంచలన వ్యాఖ్యలు?

By:  Tupaki Desk   |   10 Dec 2019 8:08 AM GMT
ఆ పాపంలో నేనూ భాగస్వామినే..స్పీకర్ సంచలన వ్యాఖ్యలు?
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్, హాట్‌గా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాలను చేపట్టకుండా వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ మండిపడింది. వంశీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని- టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. వెంటనే స్పందించిన స్పీకర్ తమ్మినేని ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఆ తర్వాత స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

వంశీ ప్రసంగం తర్వాత స్పీకర్ తమ్మనేని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైసీపీ ఆఫీసన్న మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ఎవరికీ జాగీర్ కాదని.. ప్రజల జాగీర్‌ మాత్రమేనని అన్నారు. సభలో వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వటం పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయటం పైన వైసీపీ సైతం నిరసన వ్యక్తం చేసింది. ఆ సమయంలో వంశీకే కాదు..గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు సైతం సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ అధికార పక్ష సభ్యులు మాట్లాడారు.

ఆ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. అవును..సభలో ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. ఎన్టీఆర్‌ కు అవకాశం ఇవ్వకపోవడం తప్పే .. దాని ఫలితమే తాను 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసారు. ఏకంగా స్పీకర్ సభలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం తో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే తనకు ఉన్న అధికారాలు తనకు తెలుసని..తన విధులు తనకు బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు. సభలో వంశీ సభ్యుడుగా ఉండగా..మాట్లాడే అవకాశం ఇవ్వటంలో తప్పు లేదని అయన వివరించారు.