Begin typing your search above and press return to search.

అనర్హత వేటుకు సర్కారు సాహసించదు!

By:  Tupaki Desk   |   5 Nov 2017 1:58 PM GMT
అనర్హత వేటుకు సర్కారు సాహసించదు!
X
మూడు అసెంబ్లీ సమావేశాలకు వరుసగా రాకపోతే.. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు అనేది నిబంధనల్లో ఉండవచ్చు గాక... కానీ ఏపీ ప్రభుత్వం వైకాపా మీద అలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంకేతికంగా చట్టప్రకారం, నిబంధనల ప్రకారం ఉన్న వెసులుబాటు గురించి మాత్రమే స్పీకరు ప్రస్తావించారు. అయితే ప్రాక్టికల్ గా చూసినప్పుడు అలా జరగకపోవచ్చుననేది విశ్లేషకుల వాదన.

ఇప్పుడు వర్షాకాల, శీతాకాల సమావేశాలు జమిలిగా జరుగుతున్నాయి. ఇక బడ్జెట్, వేసవికాల సమావేశాల జరగాలి. ఏప్రిల్ నాటికి జరుగుతాయని అనుకున్నా.. అప్పటికి... వైకాపా ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే.. వేటు పడవచ్చు. కానీ ఏప్రిల్ మేలలో వేటు వేసినట్లయితే.. ఆరునెలల్లోగా ఆ ఖాళీలకు ఉప ఎన్నికలు రావాల్సి ఉంటుంది. అప్పటికి ఆరునెలల్లోగా అంటే.. 2018 సంవత్సరాంతంలోగా ఉప ఎన్నికలు రావాల్సి ఉంటుంది. 2019 లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే నేపథ్యంలో కొన్ని నెలల ముందు ఇన్ని స్థానాలకు ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి పాలక పార్టీకి బహుశా ధైర్యం ఉండకపోవచ్చు. పైగా అధికారం నిర్ణయాలు ఎటూ వారి చేతుల్లోనే ఉంటాయి గనుక.. సమావేశాలను కాస్త లేటుగా నిర్వహించడం, వేటు వేయడం కాస్త లేటుగా చేయడం జరిగితే గనుక.. ఉప ఎన్నిక అనివార్యం కాకుండానే.. వైకాపా వారి పదవులు మాత్రం పోతాయి.

మొత్తానికి ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ వారి మీద ప్రభుత్వం వేటు వేయకపోవచ్చుననే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. నంద్యాల ఒక్క స్థానానికి ఉప ఎన్నిక వస్తేనే.. అక్కడ విజయం దక్కించుకోవడానికి తెలుగుదేశం నానా పాట్లు పడాల్సి వచ్చింది. మంత్రలందరూ తిష్టవేసి వంద కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే గానీ విజయం దక్కలేదు. అలాంటిది వైకాపా ఎమ్మెల్యేలందరినీ బర్తరఫ్ చేసి ఉప ఎన్నికలను రప్పిస్తే.. తెదేపాకు ఖర్చు పరంగా గుదిబండ అవుతుంది. అందుకని వారు సాహసించకపోవచ్చు. అలాకాకుండా.. ఉప ఎన్నిక రాని విధంగా.. నెలలు గడిచిన తర్వాత వేటు వేయవచ్చు. కానీ అలా చేస్తే.. తమ మీద అన్యాయంగా వేటు వేశారని వైకాపా విమర్శించడానికి ఆస్కారం ఉంటుందే తప్ప.. లాభం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రజల దృష్టిలో వైకాపా వారికి సానుభూతి కొంత జమ అవుతుంది. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని వైకాపా వారిపై అధికారికవేటు పడే ఛాన్సులేదని పలువురు భావిస్తున్నారు.