Begin typing your search above and press return to search.

మన పట్టాల మీద స్పెయిన్ రైలు దూసుకెళ్లింది

By:  Tupaki Desk   |   30 May 2016 7:18 AM GMT
మన పట్టాల మీద స్పెయిన్ రైలు దూసుకెళ్లింది
X
అవును.. మన పట్టాల మీద స్పెయిన్ రైలు దూసుకెళ్లింది. ప్రస్తుతం మనం వాడుతున్న రైలు పెట్టెల స్థానే స్పెయిన్ కు చెందిన తాల్గో రైలు బండిని ప్రయోగాత్మకంగా పరుగులు తీయించారు రైల్వే అధికారులు. మన రైలుబండికి.. తాల్గోకి మధ్యనుండే తేడా ఏమిటంటే.. ఈ రైలుబండ్లు మనం వాడే వాటి కంటే తేలికగా ఉండటంతో పాటు ఇంధనాన్ని తక్కువగా వినియోగించటం.. అత్యధిక వేగంతో ప్రయాణించటం ప్రత్యేకతలుగా చెప్పాలి.

దేశీయ పట్టాల మీదకు ఈ స్పెయిన్ రైళ్లను తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్న అధికారులు.. ప్రయోగాత్మకంగా ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నుంచి మొరాదాబాద్ ల మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రైళ్లు గరిష్ఠంగా 160 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సత్తా ఉంది. ఇక.. హైస్పీడ్ రైళ్లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. వీరు తయారు చేసే హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.

తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్ లో డీజిల్ ఇంజిన్ కు 9 తాల్గో పెట్టెల్ని తగిలించి ప్రయోగించారు. గంటకు 110 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ రైలు 90కిలోమీటర్ల దూరాన్ని 70 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశ రాజధాని ఢిల్లీ.. దేశ వాణిజ్య రాజధాని ముంబయిల మధ్య ప్రయాణించే రాజధాని ఎక్స్ ప్రెస్ వేగం గంటకు 85 కిలోమీటర్లు ఉండగా.. తాల్గో ట్రైన్ అంతకంటే వేగంగా దౌడు తీయటం గమనార్హం.

తాజాగా నిర్వహించిన మొదటి ట్రయల్ రన్ విజయవంతం అయిన నేపథ్యంలో మరికొన్నిసార్లు ట్రయల్ రన్ ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మథుర – పల్వాల్ మార్గంలో 40 రోజుల పాటు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో మరిన్ని ట్రయల్ రన్లు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అది కూడా విజయవంతం అయితే.. రానున్న రోజుల్లో దేశీయ పట్టాల మీద స్పెయిన్ తాల్గో రైలు బోగీలు పరుగులు తీసే అవకాశం ఉందని చెప్పాలి.