Begin typing your search above and press return to search.

ఆనందయ్య అరెస్ట్ పై స్పందించిన ఎస్పీ .. అసలు ఏం జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   22 May 2021 7:30 AM GMT
ఆనందయ్య అరెస్ట్ పై స్పందించిన ఎస్పీ .. అసలు ఏం జరిగిందంటే ?
X
దేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తప్ప మహమ్మారిని అంతం చేసే మరో మార్గం లేకపోవడం తో ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ తయారీ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ , నెల్లూరు జిల్లా , కృష్ణపట్నం లో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా పసరు గురించి తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం మొత్తం చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని ఆపేశారు. అయితే, నిన్న మళ్లీ కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీ మొదలైంది. దీంతో కరోనా మందు కోసం జనం దాదాపు 50వేలు ఎగబడ్డారు. దీనితో మళ్లీ ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా రోగులకు ఆయన పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు సత్ఫలితాలు ఇస్తుండటంతో అందరూ నెల్లూరు జిల్లాలోని ఆనందయ్య గ్రామం వైపు పరుగులు తీస్తున్నారు.

ప్రస్తుతం ఈ మందు పంపిణీకి బ్రేక్ పడింది. అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి పోలీసులు చేరుకున్నారు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, మ౦దు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు నుండి ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. అయితే , ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. దీనితో బొనిగి ఆనందయ్యను అరెస్ట్ చేశారంటూ వాస్తున్న వార్తలపై నెల్లూరు జిల్లా ఎస్పీ స్పందించారు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా ఆనందయ్యకు అనదపు భద్రత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా విచారణ జరుగుతుందని ఆయన్ను అరెస్టు చేయలేదని తెలిపారు. అలాగే ,నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం స్పందించారు. కృష్ణాపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బోనిగి ఆనందయ్య పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం వదంతులు మాత్రమేనని ఎవరూ నమ్మవద్దని సూచించారు.

కాగా, ఆనందయ్య మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా, ఈ రోజు ఐసీఎంఆర్ టీమ్ తో కలిసి మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ సూచనల మేరకు ఒక ఐసీఎంఆర్ బృందం నిన్ననే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంది. ఈ సందర్భంగా కరోనా ఆయుర్వేద మందుగా ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందు లో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. దీనితో ప్రస్తుతం ఆయుర్వేద ఔషధం పంపిణీని అధికారులు నిలిపివేశారు. పరిశోధనల అనంతరం ఆయుర్వేద మందు పంపిణీపై అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.

కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ఎప్పుడు మొదలవుతుంది, ఇదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ జరుగుతోంది.

మరోవైపు ఆయుర్వేద మందు కోసం కరోనా రోగులంతా భారీ సంఖ్యలో వస్తుండటం తో కృష్ణపట్నం రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊర్లో వాహనాల రద్దీ భారీగాపెరిగింది. అంబులెన్సుల్లో కరోనా రోగులు సైతం వస్తుండటంతో ఏవైనా కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని భయపడుతున్నారు. ఓ దశలో తమ గ్రామంలోకి ఎవరినీ రానీయకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆయుర్వేద నిపుణుల కమిటీ, కేంద్రం అధీనంలోని ఐసీఎంఆర్ , రెండూ ఆయుర్వేద మందు సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ లేవని, వాడినవారందరికీ మంచి ఫలితాలు కనిపించాయని చెప్పడంతో పరిస్థితి అంచనా వేస్తున్నారు. సోమవారం మరో బృందం కృష్ణపట్నంకు వెళ్తుందని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా మందు పంపిణీపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.