కాపుఐక్య గర్జన నేపథ్యంలో.. బీసీల్లోకి కాపుల్ని చేర్చాలన్న డిమాండ్ మరింత పెరిగి పెద్దదవుతోంది. కాపుల రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా.. రిజర్వేషన్ల అంశంపై ఉద్యమం చేస్తున్న ముద్రగడ వెనక్కి తగ్గటం లేదు. రేపట్నించి తన భార్య.. కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహారదీక్షకు తెర తీస్తున్నవేళ.. భావోద్వేగాలు పీక్ స్టేజ్ కు చేరుకుంటున్న పరిస్థితి.
దీంతో.. పరిస్థితులు మరోసారి చేజారకుండా ఉండేందుకు వీలుగా.. ఆంక్షల్ని విధించే ప్రయత్నం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్ననేపథ్యంలో శుక్రవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి బయటవాళ్లు రావొద్దని చెప్పారు.
జిల్లాల నుంచి బయట వ్యక్తులు ఎవరైనా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఆమరణదీక్షలో భాగంగా జిల్లాలో పదివేల మంది పోలీసుల్ని మోహరించినట్లుగా పేర్కొన్నారు.
తుని ఇష్యూలో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని తేల్చిన ఆయన.. అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలపై మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తుని ఇష్యూలో నిఘావర్గాల వైఫల్యం ఉందన్న మాటను వ్యతిరేకించిన ఆయన.. మీరు కెమేరాతో కూర్చున్నారు. నన్ను మీరు కెమేరాతో కొట్టొచ్చు.కానీ.. మీరు కెమేరాతో కొట్టొచ్చన్న ఆలోచనతో నేను ప్రిపేర్ కానుకదా? అంటూ వెరైటీగా బదులిచ్చారు.
మీడియా సమావేశానికి వచ్చినోళ్లు ఎస్పీని కెమేరాలతో కొట్టే అవకాశం దాదాపుగా ఉండదు.కానీ.. ఒక ఉద్యమంలో భాగంగా నిర్వహించే సభలో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉందన్నది నిజం. కానీ..ఏ మాత్రం సంబంధం లేని రెండు అంశాల్ని కలగలిపి ఎస్పీ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. తుని ఇష్యూపై తమ తప్పును కవర్ చేసుకోవటానికి పోలీసులు ఎంత కష్టపడుతున్నారో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.