Begin typing your search above and press return to search.

పోలీసులనే జైల్లో పెట్టిన ఎస్పీ

By:  Tupaki Desk   |   11 Sep 2022 6:30 AM GMT
పోలీసులనే జైల్లో పెట్టిన ఎస్పీ
X
మనదేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇలాంటి విచిత్రాల్లో దొంగలను జైల్లో పెట్టాల్సిన పోలీసులే జైల్లో కూర్చోవాల్సొచ్చింది. పోలీసులే జైల్లో కూర్చోవాల్సొస్తుందని ఎవరైనా ఊహించగలరా ? కానీ జరిగింది మాత్రం వాస్తవమే. పనితీరు నచ్చలేదని బీహార్లోని నవాదా జిల్లా ఎస్పీ ఐదుగురు పోలీసులను కొద్ది గంటలపాటు జైల్లో ఉంచారు. ఈ ఘటన బయటపడి ఇపుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే నవాదా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళ్ రెగ్యులర్ గా తన కింద స్థాయి పోలీసు అధికారుల పనితీరును రివ్యూ చేస్తుంటారట. ఇలాంటి రివ్యూల్లోనే ఐదుగురి పనితీరు ఏ మాత్రం సరిగా లేదట. దాంతో ఎస్పీకి చిర్రెత్తింది. దాంతో మీ పనితీరు సంతృప్తికరంగా లేదు కాబట్టి రెండు గంటలు లాకప్ లో ఉండండని ఆదేశించారట. ఎస్పీ ఆదేశాలతో ఏమిచేయాలో ముందు పోలీసులకు అర్థం కాలేదు. కానీ రెండోసారి ఎస్పీ గట్టిగా చెప్పటంతో తర్వాత ఏమి కొంపలు ముణగిపోతాయో అన్న భయంతో ఐదుగురు వెళ్ళి లాకప్ లో కూర్చున్నారట.

దొంగలను, నేరస్ధులను లాకప్ లో పెట్టే పోలీసులు చివరకు తమంతట తాముగా వెళ్ళి లాకప్ లో కూర్చోవాల్సొచ్చింది. మొన్నటి గురువారం ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్ఐలు రెండుగంటలు లాకప్ లో గడపారన్న విషయం ఆలస్యంగా బయటపడిందట. ఐదుగురు పోలీసులు లాకప్ లో ఉన్న ఫొటో, వీడియో దృశ్యాలు ఇపుడు బీహార్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే మీడియా అలర్టయ్యింది. వివరణ కోసం ఎస్పీతో మాట్లాడితే అదంతా ఉత్తిదే అని కొట్టిపడేశారు.

మరి లాకప్ లో పోలీసులున్న ఫొటోలు, వీడియోల గురించి అడిగితే ఎస్పీ ఏమీ సమాధానం చెప్పలేదు. ఇదే విషయమై ఇఫుడు పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. పోలీసులనే లాకప్ లో ఉంచిన ఘటనపై ప్రభుత్వం వెంటనే జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేసింది. మరి తాజా వివాదం ఏమవుతుందో చూడాలి.