Begin typing your search above and press return to search.

అఖిలేష్ లో పెరిగిపోతున్న జోష్

By:  Tupaki Desk   |   26 Nov 2021 7:30 AM GMT
అఖిలేష్ లో పెరిగిపోతున్న జోష్
X
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లో జోష్ పెరిగిపోతోంది. చిన్నా, చితకా పార్టీలతో కూడా పొత్తులు కుదుర్చుకోవటంలో చాలా బిజీగా ఉంటున్నారు.

తాజాగా అప్నాదళ్ (కే) పార్టీతో అఖిలేష్ పొత్తులు కుదుర్చుకున్నారు. యూపీలోని కుర్మీ సామాజికవర్గంలో అప్నాదళ్ పార్టీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో అప్మాదళ్ (ఎస్)తో పొత్తు వల్ల ఎన్డీయే రూపంలో బీజేపీ బాగా లాభపడింది. ఆ తర్వాత పార్టీలో చీలిక రావటంతో అప్నాదళ్ (కే) ఏర్పాటైంది.

సీట్ల సర్దుబాటుపై క్లారిటి రాలేదు కానీ పొత్తు మాత్రం ఖరారైనట్లు రెండుపార్టీల నేతలు ప్రకటించారు. అలాగే ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)తో కూడా పొత్తు ఖాయమైందనే అనుకోవాలి. ఇప్పటికి ఆప్ కు యూపీలో ఒక్కసీటు కూడా లేదు. అయితే చాలా నియోజకవర్గాల్లో ఆప్ కు సుమారు వెయ్యి ఓట్లుంటాయని సమాచారం.

రాబోయే ఎన్నికల్లో పెద్ద పార్టీలకు చాలా కీలకమైంది కాబట్టే వంద ఓట్లు తేగలిగిన చిన్న పార్టీలను, అభ్యర్ధులను వదులుకోవటానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ఇందులో భాగంగానే ఎస్పీ-ఆప్ మధ్య పొత్తు.

నిజానికి ఎస్పీకి ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ భావజాలానికి దూరమే. అయితే ఇద్దరినీ కలిపింది మాత్రం బీజేపీపై వ్యతిరేకతే అని చెప్పాలి. కేజ్రీవాల్ కు మిస్టర్ క్లీన్ ఇమేజికి, ఎస్పీ బలం తోడైతే రెండుపార్టీలు లాభపడతాయనే ఉద్దేశ్యంతో పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు ఖరారైనట్లు రెండుపార్టీల నేతలు ప్రకటించారు.

ఇదే ఊపులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కూడా అఖిలేష్ ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. ఎస్పీ అధికారంలోకి వస్తే తమకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అసద్ షరతు విధించారట. ఈ విషయంపైనే ఏమీ తేల్చుకోలేకపోతున్నారట అఖిలేష్.

చిన్నా, చితకా పార్టీలతో కూడా అఖిలేష్ ఎందుకు ఇంతగా పొత్తు చర్చలు జరుపుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న టార్గెట్టే కారణం. ప్రీ పోల్ సర్వే ప్రకారం ఎస్పీ సుమారు 130 సీట్లలో గెలుస్తుందని తేలింది. అందుకనే కొంచెం కష్టపడితే, చిన్న పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకుని ఓట్లలో చీలికను కంట్రోల్ చేయగలిగితే అధికారంలోకి వచ్చేయన్నది అఖిలేష్ ఆలోచన.

రాబోయే రోజుల్లో బీజేపీ మీద జనాల్లో వ్యతిరేకత పెరగటమే కానీ తగ్గేదుండదని ఎస్పీ అంచనా వేస్తోంది. అందుకనే మొదట్లో పొత్తులపై పెద్దగా శ్రద్ధచూపని అఖిలేష్ ఇపుడు మాత్రం పొత్తులపైనే పూర్తి దృష్టిపెట్టారు. 403 సీట్లలో పొత్తుల్లో 100 సీట్లు వదులుకుంటే అంతే సంఖ్యలో తమకు లాభం జరుగుతుందని అనుకుంటున్నారట. మరి అఖిలేష్ అంచనా ఏమేరకు నిజమవుతుందనేది చూడాలి.