Begin typing your search above and press return to search.

గోదావరి జిల్లాలో ఇదేం పని?

By:  Tupaki Desk   |   15 Aug 2015 11:01 AM GMT
గోదావరి జిల్లాలో ఇదేం పని?
X
సీఐ నచ్చలేదా..బదిలీ చేసెయ్‌. డీఎస్పీ చెప్పిన మాట వినట్లేదా...లేటు చేయకుండా పంపించేయ్. ఇలా కొన్నాళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లాలో తంతు జరుగుతోందట. అంతా తమ హవానే నడవాలని పశ్చిమగోదావరి జిల్లా తెలుగు దేశం నాయకులు తెగ ఆరాటపడుతున్నారని వార్తలు జోరుగా వెలువడుతున్నాయి. ఉద్యోగులంతా తాము చెప్పినట్టు చేసి జీతాలు తీసుకుంటే చాలు అని అధికార పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారని, ముఖ్యంగా రెవెన్యూ,పోలీస్ డిపార్టుమెంట్లలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయిందని అధికారులు వాపోతున్నారు.

ప్రభుత్వ శాఖల్లో మామూలుగా బదిలీలు రెండుమూడేళ్ళకు జరుగుతాయి. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో సీఐలు,ఎస్సైల బదిలీలు వారానికోసారి జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదనే రీతిలో తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. కోడిపందాలు, పేకాట ఎక్కువగా ఆడే దెందులూరు, భీమవరం, ఉంగుటూరు, నిడదవోలు, ఉండి నియోజకవర్గాలలో అధికారి నచ్చలేదంటే బదిలీ చేసేదాకా నిద్రపోడంలేదని, ఉన్నఫళాన బదిలీల కోసం పట్టుపడుతున్నారని పై అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చంద్రబాబుకు ఇదే తరహా ప్రతిపాదన పెట్టగా....బాబు తిరస్కరించారట. పని చేసుకునే వాళ్లకు ప్రభుత్వం తరఫున ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకూల వాతావరణం కల్పిస్తామని బాబు తేల్చిచెప్పారట. దీంతో సదరు నేత వెనక్కు తగ్గాల్సివచ్చిందని టీడీపీ నాయకులు వివరిస్తున్నారు.

గతంలో కోడిపందాలకు అనుమతివ్వని ఎస్పీని వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ ఏకంగా ఇద్దరు ఎంపీలు ఆందోళనకు దిగడం చూసి జనం అవాక్కైపోయారు. అప్పుడు మొదలైన ఆనవాయితీని ఛోటామోటా లీడర్లు కొనసాగిస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఏ ఎస్సై, సీఐ దూకుడు చూపించినా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వెళ్లిపోతున్నాయట. అవసరమైతే పోలీస్‌ స్టేషన్ల ముందు ఆందోళనలకు సైతం ఎమ్మెల్యేలు వెనకాడటంలేదు. జిల్లాలో టీడీపీ తప్ప మరోపార్టీ పవర్‌ లో లేకపోవడం కూడా ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో ముగ్గురు ఎస్పీలు మారారని, ఇపుడున్న ఎస్పీ ఎంత కాలం ఉంటారో చెప్పలేమన్న చర్చ జిల్లాలో జరుగుతోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.