Begin typing your search above and press return to search.

అమిత్ షాతో కాలేదు..దక్షిణాది కమల దళపతి నద్దానే!

By:  Tupaki Desk   |   30 Nov 2019 5:39 PM GMT
అమిత్ షాతో కాలేదు..దక్షిణాది కమల దళపతి నద్దానే!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటికీ దక్షిణ భారతం కొరుకుడు పడటం లేదు. ఎన్ని వ్యూహాలు రచించినా కూడా వర్కవుట్ కావడం లేదు. దక్షిణాదిలో తనకు పట్టున్న కర్ణాటకలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి అంతగా పట్టు లేదనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో మొన్నటిదాకా దక్షిణ భారతంలో ఎలాగైనా జెండా పాతేయాలంటూ తనదైన రీతిలో వ్యూహాలు రచించి అమలు చేసి... ఘోరంగా విఫలమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... ఇప్పుడు దక్షిణాది బాధ్యతలను పూర్తిగానే వదిలేశారనే చెప్పాలి. పార్టీ జాతీయ కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి అందులో కూర్చోబెట్టిన కేంద్ర మాజీ మంత్రి జగత్ ప్రకాశ్ నద్దా ఇప్పుడు దక్షిణాది కమల దళపతిగా కొత్త అవతారం ఎత్తారనే చెప్పాలి.

బీజేపీకి సంబంధించి దాదాపుగా అన్ని వ్యవహారాలూ ఇప్పుడు జేపీ నద్దానే చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ వ్యవహారాలతో పాటుగా తాజాగా తమిళనాడుకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను కూడా జేపీ నద్దా తన భుజానికెత్తుకున్నారు. ఇందుకు నిదర్శనంగా చాలా అంశాలే ఉన్నాయి. ఏపీకి సంబంధించిన వ్యూహాల రచన ఢిల్లీలోని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇల్లు కేంద్రంగా నద్దానే నడిపిస్తున్నారు. తెలంగాణకు చెందిన నేతలు ఎవరు పార్టీలో చేరినా కూడా జేపీ నద్దా సమక్షంలోనే చేరిపోతున్నారు. ఏపీ నేతలు కూడా నద్దా సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన చేరికలు కూడా నద్దా సమక్షంలోనే జరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా శనివారం ప్రముఖ సినీ నటి నమితతో పాటు మరో సీనియర్ తమిళ నటుదు రాధారవి... నద్దా సమక్షంలోనే బీజేపీలో చేరిపోయారు.

కర్ణాటకలో మరోమారు అధికారం చేజిక్కించుకునేందుకు అమిత్ షా రచించిన వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. షా రచించిన వ్యూహాలు పార్టీకి చాలా కాలం తర్వాత కర్ణాటక పగ్గాలు దక్కేలా చేసినా... పార్టీ ప్రతిష్ఠ గంగలో కలిసిపోయిందన్న వాదనలు లేకపోలేదు. ఈ క్రమంలో దక్షిణాది రాజకీయాలను తాను అనుకున్నట్లుగా నడిపించలేకపోయిన అమిత్ షా... స్వచ్ఛందంగానే వాటిని జేపీ నద్దాకు అప్పగించేశారన్న వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే... దక్షిణాదికి సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నీ కూడా నద్దానే పర్యవేక్షిస్తున్నారు. మరి నద్దా అయినా దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేస్తారో? లేదో? చూడాలి.