Begin typing your search above and press return to search.

అప్పుడు బీటాను.. ఇప్పుడు ఒమ్రికాన్ ను గుర్తించింది సౌతాఫ్రికా సైంటిస్ట్ లే

By:  Tupaki Desk   |   28 Nov 2021 12:30 PM GMT
అప్పుడు బీటాను.. ఇప్పుడు ఒమ్రికాన్ ను గుర్తించింది సౌతాఫ్రికా సైంటిస్ట్ లే
X
కొవిడ్ కథ ముగింపునకు వచ్చినట్లే అన్న వేళలో.. తెర మీదకు వచ్చిన తాజా ట్విస్టు ఇప్పుడు ప్రపంచానికి కొత్త భయాందోళనను పరిచయం చేస్తోంది. తాజాగా గుర్తించిన ఒమ్రికాన్ వేరియంట్ ను దక్షిణాఫ్రికా సైంటిస్టులే గుర్తించటం తెలిసిందే. నిజానికి కరోనా తొలిదశలోని బీటా వేరియంట్ ను గుర్తించింది కూడా సౌతాఫ్రికానే. చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న బీటా వేరియంట్ వివరాల్ని ప్రపంచానికి ఎక్కువగా వెల్లడించింది దక్షిణాఫ్రికానే.

తాజాగా ఒమ్రికాన్ వేరియంట్ మీద ప్రపంచాన్ని అలెర్టు చేసింది దక్షిణాఫ్రికానే. మిగిలిన మరే దేశం చేయలేని పనిని ఆ దేశం ఎలా చేయగలుగుతోంది? దానికి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. వారు ఏర్పాటు చేసిన నెట్ వర్క్ ఫర్ జోనీమిక్స్ సర్వైలెన్స్ పుణ్యమేనని చెప్పాలి. కరోనా మహమ్మారి తన తీవ్రతను ప్రపంచానికి చూపించటం మొదలు పెట్టినప్పుడే ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మహమ్మారిలో చోటు చేసుకునే మార్పుల్ని రోజువారీగా విశ్లేషించేందుకు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థే.. తాజా ఒమ్రికాన్ ను గుర్తించేలా చేసింది.

2020 చివర్లో ఈ నెట్ వర్కు శాస్త్రవేత్తలే బీటా రకాన్ని గుర్తించారు. ఇంతకీ ఈ సెంటర్ పని తీరు ఎలా ఉంటుందన్నది చూస్తే.. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాలకు సంబంధించిన జన్యుక్రమాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో తాము సేకరించిన ప్రతి జన్యుక్రమాన్ని తనిఖీ చేస్తారు. ఇలా చేయటం ద్వారా తమకు లభించిన శాంపిళ్లకు.. బయట ఉన్న వేరియంట్లకు మధ్య తేడాను గుర్తిస్తారు.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ కు.. తాము శాంపిళ్ల ద్వారా సేకరించిన దానికి మధ్య వైరుధ్యాన్ని గుర్తిస్తారు. టీకా లేదంటే అంతకు ముందు ఇన్ ఫెక్షన్ వల్ల వెలువడిన యాంటీ బాడీలు.. కొత్త వేరియంట్ ను ఏ మాత్రం ప్రభావితం చేస్తాయన్నది పరిశీలిస్తారు. ఇందులోని వైరుధ్యాల్ని గుర్తించి.. వాటిని సొంతంగా మళ్లీ డెవలప్ చేసి.. వాటిని మునుపటి రోగ నిరోధక శక్తితో ఎంతమేర అడ్డుకోగలుగుతారని చెబుతున్నారు. ఈ డేటా ఆధారంగానే కొత్త వైరస్ ను వర్గీకరిస్తారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా లాంటి అద్భుత ఆణిముత్యాన్ని ప్రపంచాన్ని అందించిన ఘనత చైనాది అయితే.. కొత్త వేరియంట్లను దక్షిణాఫ్రికాలోనే ఎందుకు బయటపడుతున్నాయి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. శాస్త్రవేత్తలు.. నిపుణుల అభిప్రాయాల్ని చూసినప్పుడు.. దక్షిణాఫ్రికాలో చేసిన బలమైన ఏర్పాటే కొత్త మ్యూటెంట్లను గుర్తించి అలెర్టు చేస్తున్నారని చెప్పక తప్పదు.

రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తుల కారణంగానే ఈ కొత్త వేరియంట్ ఉత్పన్నమై ఉండొచ్చని చెబుతున్నారు. ఇలాంటి వారి శరీరంలో నుంచి ఒక పట్టాన వైరస్ తొలిగిపోదు. అందువల్ల వారిలో దీర్ఘకాలం పాటు క్రియాశీల ఇన్ ఫెక్షన్ కొనసాగుతుంటాయి. అదే కొత్త వేరియంట్లకు కారణమవుతుందని చెప్పొచ్చు. బలహీనమైన రోగి శరీరంలోని రోగ నిరోధక శక్తి వైరస్ ను నిర్మూలించే స్థాయిలో లేనప్పుడు ఆ సూక్ష్మజీవి మీద కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వైరస్ మార్పు చెందటమే కాదు.. కొత్త వైరస్ కు అవకాశాన్ని ఇస్తుందని చెబుతున్నారు.