Begin typing your search above and press return to search.

అట్లాంటిక్‌ సముద్రంలో శబ్దాలు... టైటాన్‌ దొరుకుతుందా?

By:  Tupaki Desk   |   21 Jun 2023 3:00 PM GMT
అట్లాంటిక్‌ సముద్రంలో శబ్దాలు... టైటాన్‌ దొరుకుతుందా?
X
అట్లాంటిక్‌ మహా సముద్రం లో సుమారు 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్‌ నౌక శకలాల ను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. ఇందు లో బ్రిటన్‌ కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్‌ హార్డింగ్‌, పాకిస్థాన్‌ బిలియనీర్‌ షాజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌, మరో ఇద్దరు ఉన్నారు. ఈ సమయంలో అట్లాంటిక్‌ జలగర్భంలో శబ్దాల ను గుర్తించిన కెనడా నిఘా విమానం తెలిపింది.

అవును... గాలింపు చర్యలు చేపడుతున్న కెనడా కు చెందిన పీ-8 నిఘా విమానం.. నీటి అడుగున శబ్దాల ను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ లోని నార్త్‌ ఈస్ట్‌ కమాండ్‌ పేర్కొంది. కెనడా విమానం సముద్రంలో శబ్దాల ను గుర్తించిందని అమెరికా పత్రికలు కూడా పేర్కొన్నాయి. దాదాపు ప్రతి 30 నిమిషాలకు ఈ చప్పుళ్లు వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని వెల్లడించాయి.

ఇదే సమయంలో దాదాపు నాలుగు గంటల పాటు ఈ శబ్దాల ను గుర్తించినట్లు హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది. దాదాపు మూడు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో ఇదే తొలి పురోగతి కాగా... జలాంతర్గామిలో మరో 30 గంటల కు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే మిగిలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కాగా... ఓషన్‌ గేట్‌ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్ర లో టైటానిక్‌ శకలాల సందర్శన కూడా ఒక భాగం. దీని కోసం టైటాన్‌ అనే పేరుగల 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని వాడారు. ఈ యాత్ర లో భాగంగా 400 నాటికల్‌ మైళ్ల దూరం లోని టైటానిక్‌ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది.

అయితే ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్‌ ల్యాండ్‌ లోని సెయింట్‌ జాన్స్‌ కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్‌.. సముద్రంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించిన గంటా 45 నిమిషాల్లోనే ఆ జలాంతర్గామితో పోలార్‌ ప్రిన్స్‌ కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో టైటాన్‌ ఆచూకీ కనుగొనేందుకు అమెరికా, కెనడా కోస్ట్‌ గార్డ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.