Begin typing your search above and press return to search.

త్వరలో పోలవరం... అంబటి చెప్పిన అసలు నిజం...?

By:  Tupaki Desk   |   24 April 2022 2:36 AM GMT
త్వరలో పోలవరం... అంబటి చెప్పిన అసలు నిజం...?
X
పోలవరం ఏపీకి జీవనాడి. అది కనుక పూర్తి అయితే ఏ భాగ్యనగరమూ ఏపీకి రాజధానిగా ఉండాల్సిన అవసరం లేదు, అది బహుళార్ధక సాధక ప్రాజెక్ట్. ఇటి సాగునీరు, అటు తాగు నీరు, మరో వైపు విద్యుత్, ఇంకో వైపు పారిశ్రామిక అవసరాలు ఇలా అన్ని వైపులా పోలవరం ఏపీకి లైట్ హౌస్ లాంటి ప్రాజెక్ట్. ఇది కదా అసలు మాట. ఇది క‌దా జరగాల్సిన కధ. పోలవరం రేపో మాపో పూర్తి అవుతుంది అన్నట్లుగా 2018 నుంచి ఏలికలు కలరింగ్ ఇచ్చారు. త్వరలో విడుదల పోస్టర్లు కూడా వేసి హడావుడి చేశారు. నాడు డేట్లు మార్చిన ఘనత టీడీపీ సర్కార్ ది అయితే నేడు కొత్త డేట్లు మారుస్తూ ఊరిస్తున్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది.

వైసీపీలో పాత మంత్రి అనిల్ కుమార్ ఉన్నంతవరకూ 2020, 2021, 2022 ఇలా ఎన్నో డేట్లు మారాయి. ఫలానా టైమ్ కి పూర్తి రాసుకోండి అని వారూ వీరూ కూడా సవాళ్ళు విసురుకున్నారు. సరే అవేమీ జరగలేదు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి జగన్ అయితే పోలవరం మీద సమీక్ష చేశారు. కేంద్ర మంత్రి గజెంద్ర సింగ్ షెకావత్ తో కలసి పోలవరం ప్రాజెక్ట్ ని కూడా సందర్శించారు.

మరి జగన్ ఇచ్చిన లేటెస్ట్ డేట్ ఏంటి అంటే 2023 జూన్ నాటికి అని. ఈ లోగా కొత్త మంత్రి వచ్చారు. ఆయనే సీనియర్ మోస్ట్ నేత అంబటి రాంబాబు. ఆయన వచ్చిన దగ్గర నుంచి పోలవరం మీద అపశకునాలే పలుకుతున్నారు. అయితే ఆయన తన సొంత శాఖలో అందునా ఏపీకి, వైసీపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం గురించి ఎందుకలా చేదుగా చెబుతారు. ఆయనకు మాత్రం తన హయాంలో ప్రాజెక్ట్ పూర్తి కావడం ఇష్టం ఉండదా.

మరి పోలవరం ఎపుడు పూర్తి అవుతుందో అన్నీ పరిశీలించి అధ్యయనం చేసి చెబుతామని తాపీగా అంబటి అంటున్నారు. అంటే అంబటి నోటి వెంట అసలు నిజాలు అలా బయటకు వచ్చాయా. అదే అయితే మరి ఇంతకాలం అదే వైసీపీ నేతలు,మంత్రులు చెప్పిన మాటల సంగతేంటి. ఇలా ఎన్నో డౌట్లు ఏపీ జనాల్లో పెరిగిపోతున్నాయి.

ఇక అంబటి ఒక్కటే పాయింట్ పట్టుకుని టీడీపీ మీద చెడుగుడు ఆడుతున్నారు. అదేంటి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పాడయ్యేందుకు గత ప్రభుత్వ తప్పిదమని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతినిపోలేదని కూడా అంటున్నారు. అలా జరగడం వెనక టీడీపీ తప్పులే కారణమని అంటున్నారు.

ఎక్కడైనా, ఎవరైనా కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ కట్టాక స్పిల్ వే నిర్మించాల్సి ఉంటుందని అంబటి అంటున్నారు. అయిత గత టీడీపీ సర్కార్ మాత్రం కాఫర్ డ్యాం, అప్రోచ్ కెనాల్ పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ కట్టారని అంబటి అతి పెద్ద విమర్శ చేశారు. దాని వల్లనే అప్పట్లో వచ్చిన వరదలకు ఏకంగా డయాఫ్రం వాల్ దారుణంగా దెబ్బ తినేసిందని అంటున్నారు.

ఇక దీని వల్ల నష్టం ఎంత అంటే డయాఫ్రం వాల్ కి ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు ఖర్చు రూ.800 కోట్లు, డయాఫ్రం వాల్ లోని నీటిని ఎత్తిపోసేందుకు ఖర్చు రూ.2,100 కోట్లు అని వెల్లడించారు, అంటే అంబటి టోటల్ గా చెప్పిన లెక్క ప్రకారం మూడు వేల కోట్లు. అంటే ఇది కచ్చితంగా కేంద్రం ఇవ్వని ఖర్చు. ఏపీ సర్కార్ భరించాల్సిన ఖర్చు. టీడీపీ తప్పిదమా లేక మరోటా అన్నది పక్కన పెడితే డయాఫ్రం వాల్ ఇపుడు పోలవరానికి పెద్ద అడ్డంకి అని అంబటి తేల్చేశారు.

ఇక దెబ్బతిన్న డయాఫ్రం వాల్ మళ్లీ కట్టాలా? లేక కొత్తది నిర్మించాలా అన్న దాని మీద అధ్యయనం చేస్తామని అంబటి అంటున్నారు. అన్నీ పరిశీలించాకనే పోలవరం ఎపుడు పూర్తి అవుతుంది అన్నది చెబుతామని కూడా అంటున్నారు. సరే ఇక్కడ ఒక విషయం ఉంది. డయాఫ్రం వాల్ దెబ్బ తిందని 2020 మార్చి 8న గుర్తించారుట. అంటే ఇప్పటికి అక్షరాలా పాతిక నెలల‌ క్రితం.

మరి ఆ సంగతి మొన్నామధ్యన సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పేంతవరకూ ఎవరూ పెద్దగా చెప్పలేదు. అది సరే అనుకున్నా అనిల్ కుమార్ హయాంలో ఎందుకు ఈ అధ్యయనాలు జరగలేదు, ఆయన కూడా రేపో మాపో పోలవరం పూర్తి అని ఎందుకు చెప్పారు. ఇవన్నీ సందేహాలే. ఇపుడు అంబటి అసలు కధ అంతా డయా ఫ్రం వాల్ తోనే అంటున్నారు. పైగా దాని సంగతి చూశాక కానీ పోలవరం ఎపుడు పూర్తి అన్నది డేట్ టైమ్ ఇచ్చి మరీ చెప్పలేమని కూడా కుండబద్ధలు కొడుతున్నారు.

మొత్తానికి అర్ధమయ్యే విషయం ఏంటి అంటే పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు అనే. ఒక విధంగా రెండేళ్ల కాలం వైసీపీ సర్కార్ కి ఉంది. ఈ లోగా డయాఫ్రం వాల్ అధ్యనాలు జరిగి ఏం చేయాలని ఆలోచిస్తారా అన్న డౌట్లూ వస్తున్నాయి. మరి అంబటి చెప్పినదే అసలు నిజమైతే అందుకు సంతోషించాలో. లేక చింతించాలో కూడా అర్ధం కాని పరిస్థితి. మొత్తానికి ఏపీకి జీవనాడి లాంటి పోలవరమా ఎపుడు ఇస్తావు వరమని ఆ గోదావరినే అడగాలేమో.