Begin typing your search above and press return to search.

మహమ్మారి మీద ప్లానింగ్ ఎలా ఉండాలో చేతల్లో చూపించిన సూద్

By:  Tupaki Desk   |   11 May 2021 6:30 AM GMT
మహమ్మారి మీద ప్లానింగ్ ఎలా ఉండాలో చేతల్లో చూపించిన సూద్
X
శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు మనమెంతో అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది శత్రువు కంటికి కనిపించకుండా యుద్ధం చేస్తున్నప్పుడు ప్రజలు.. పాలకులు మరెంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు అవగాహన లేకపోవచ్చు. అన్ని విషయాలు తెలీక వారు తప్పులు చేస్తుండొచ్చు. కానీ.. వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులదేగా? వారున్నది అందుకేగా? ప్రజా సంక్షేమం కంటే తమకేదీ ముఖ్యం కాదన్నట్లుగా మాటలు చెప్పే ప్రభుత్వాల.. కరోనా వేళ ఎవరెలా స్పందించారో ప్రజలకు తెలియంది కాదు. నిజానికి.. చాలా ప్రభుత్వాల కంటే కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయంగా ఉన్నాయి. కోవిడ్ కష్టాలపై ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కదిలిపోయి.. స్వచ్చంద సేవా సంస్థను ఏర్పాటు చేసి.. తన ముందుకు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అమితంగా కష్టపడుతున్న వారిలో ప్రముఖ నటులు సోనూసూద్.

సెకండ్ వేవ్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. దానిపై పోరుకు ఆలస్యంగా కళ్లు తెరిచిన ప్రభుత్వాలు.. ఇప్పుడు కిందా మీదా పడుతున్నాయి. తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని అధిగమించటానికి వారు ప్రయత్నిస్తున్నారు. మొదటి వేవ్ ను ముందుజాగ్రత్తతో అధిగమించిన నేపథ్యంలో సెకండ్ వేవ్ ను సింఫుల్ గా తీసుకున్న ప్రభుత్వాలు అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ప్రజలు అయితే.. తమ జీవితాల్లో ఎప్పుడు ఎదుర్కొనంత భారీ విపత్తును.. విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. సెకండ్ వేవ్ ఇంతలా ఉంటే.. మరి మూడో వేవ్ ఎలా ఉంటుందన్న ఆలోచనే వణికిపోయేలా చేస్తుంది.

వచ్చిన సెకండ్ వేవ్ పోక మానదు.. అదే సమయంలో థర్డ్ వేవ్ రాక మానదు. మరి.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచి మొదలు పెట్టకుంటే.. అప్పటి పరిస్థితి మరింత విషమంగా ఉంటాయన్నది మర్చిపోకూడదు. పాలకులు చేయాల్సిన ఈ పనిని సోనూసూద్ చేస్తున్నారు. తాజాగా ఆయనో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ఫ్లాంట్లను నెలకొల్పాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇప్పటికే ఆ దేశం నుంచి ఒక ఆక్సిజన్ ప్లాంట్ కు ఆర్డర్ చేశామని.. మరో 10 - 12 రోజుల్లో అక్కడి నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూ తెలిపారు. అంతేకాదు.. మరికొన్ని దేశాల నుంచి ప్లాంట్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘టైమ్’’ అన్నది అతి పెద్ద సవాలు అని.. ప్రతిది సమయానికి అందించేలా తమ వంతుగా తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సోయి పాలకులకు ఉండి ఉంటే.. ప్రజలు ఇప్పుడు పడుతున్న వెతలు కచ్ఛితంగా అయితే పడే వారు కాదని చెప్పక తప్పదు.