Begin typing your search above and press return to search.

మోడీ ఫెయిల్యూర్ చెప్పేలా సోనియా చెప్పిన ‘వావ్’ ఐడియా

By:  Tupaki Desk   |   20 May 2021 3:30 PM GMT
మోడీ ఫెయిల్యూర్ చెప్పేలా సోనియా చెప్పిన ‘వావ్’ ఐడియా
X
అసలుసిసలు దేశ భక్తుడిగా కీర్తిని అందుకుంటూ.. దేశంలో మరే రాజకీయ నేతకు లేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ టైం అస్సలు బాగోనట్లుగా ఉంది. సమయానికి తగ్గట్లుగా ఆలోచనల్ని తెర మీదకు తీసుకొచ్చి.. దేశ ప్రజల్ని సర్ ప్రైజ్ చేసే ఆయనకు ఈ మధ్యన ఏమైందో అస్సలు అర్థం కాని పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ ఏ ముహుర్తంలో మొదలైందో కానీ.. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు వరుస పెట్టి వేలెత్తి చూపేలా ఉంటున్నాయి. అదే సమయంలో.. నిత్యం కాకుండా అప్పుడోసారి.. అప్పుడోసారి అన్నట్లుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెర మీదకు తీసుకొస్తున్న ఆలోచనలు..అదిరేలా ఉండటమే కాదు.. ఈ దేశంలో తప్పనిసరిగా అమలు చేయాలన్నట్లుగా ఉంటున్నాయి.

తాజాగా అలాంటి ఆలోచనను ఆమె షేర్ చేసుకున్నారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఆమె ఒక లేఖ రాశారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది చిన్నారులకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే తండ్రినో.. తల్లినో.. ఇద్దరినో కోల్పోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

అలాంటి పిల్లలకు అండగా ఉండాల్సిన అవసరం కేంద్రానికి ఉందని ఆమె పేర్కొన్నారు. వారికి ఎదురైన అనూహ్య విషాదం నేపథ్యంలో చిన్నారుకలు గొప్ప భవిష్యత్తు కోసం గొప్ప ఆశల్ని కల్పించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. కరోనా కారణంగా పిల్లల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని తాము కోల్పోయినట్లుగా వార్తలు వస్తున్నాయని.. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

తన భర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్ని ప్రారంభించారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. కరోనా విషాదం వేళ.. దేశ ప్రజలందరికి ఉపయోగపడే ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారని చెప్పాలి. నిజానికి.. దేశం కోసం దేశ ప్రజల కోసం అనుక్షణం.. అహరహం ఆలోచించే మోడీ మాష్టారికి ఇలాంటి ఐడియా ఎందుకు రానట్లు..?