Begin typing your search above and press return to search.

సోనియా , మాయావతికి భారతరత్న ఇవ్వాలి ..మాజీ సీఎం డిమాండ్ !

By:  Tupaki Desk   |   7 Jan 2021 12:30 AM GMT
సోనియా , మాయావతికి భారతరత్న ఇవ్వాలి ..మాజీ సీఎం డిమాండ్ !
X
మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీఎస్సీ అధినేత్రి మాయావతిలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ డిమాండ్ చేశారు. వీరిద్దరూ దేశానికి ఎంతో సేవ చేశారని, మహిళా సాధికారతను పెంపొందించారని ఆయన కొనియాడారు. సోనియా, మాయావతి రాజకీయ వ్యక్తిత్వాలు వేరు కావచ్చని, వీరి రాజకీయాలతో మీరు ఏకీభవించకపోవచ్చని, కానీ, భారతీయ మహిళల గౌరవాన్ని వీరు ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని అన్నారు.

ఈసారి ప్రకటించబోయే భారతరత్న అవార్డుల్లో సోనియా, మాయాలను భారతరత్నకు ఎంపిక చేసి గౌరవించాలని రావత్ డిమాండ్ చేశారు. బుధవారం ట్టిట్టర్ ద్వారా ఆయన ఈ డిమాండ్‌ను వెల్లడించారు. సోనియా గాంధీ, మాయవతిల ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రావత్.. గౌరవనీయమైన సోనియాగాంధీ, గౌరవనీయమైన బెహెన్ మాయావతి.. ఇద్దరూ ప్రముఖమైన రాజకీయ వ్యక్తిత్వాలు. సోనియా రాజకీయాలతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు. కానీ భారతీయ మహిళ గౌరవాన్ని ప్రజా సేవ ప్రమాణాలను సామాజిక అంకితభావాన్ని ఆమె ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఈరోజు ఆమె దేశ మహిళా స్వరూపానికి అద్భుతమైన నిదర్శనం. ఇక మాయావతి, చాలా సంవత్సరాలుగా పీడిత, బాధిత మనసుల్లో ఎంతో విశ్వాసాన్ని సంపాదించారు. వీరిద్దరినీ భారతరత్నతో అలంకరించాలి అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రధానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 1954లో భారతరత్నను ప్రవేశపెట్టారు. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, ప్రసిద్ధ శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సిఎన్ రావు కూడా భారతరత్న అందుకున్న వారిలో ఉన్నారు. హరీష్ రావత్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.