Begin typing your search above and press return to search.

సోనియా చెప్పే వరకు మోడీకి తట్టలేదా?

By:  Tupaki Desk   |   18 April 2021 5:30 PM GMT
సోనియా చెప్పే వరకు మోడీకి తట్టలేదా?
X
దేశానికి చాలామంది ప్రధానులు వచ్చారు వెళ్లారు. నెహ్రు.. లాల్ బహుదూర్ శాస్త్రి.. ఇందిర.. పీవీ.. వాజ్ పేయ్ లాంటి వారు చప్పున గుర్తుకు వస్తారు. కానీ.. యావత్ దేశాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ.. తమ మాట ప్రభావానికి గురి చేసిన ప్రధానుల విషయానికి వస్తే.. ఈ జాబితాలోని పేర్లుచాలానే తగ్గించాల్సి వస్తుంది. అదే సమయంలో.. ఈ లిస్టులో లేని మోడీ పేరును చేర్చాల్సి ఉంటుంది.

స్వతంత్ర భారతంలో ఇందిర తర్వాత.. యావత్ దేశానికి.. మారుమూల ఉన్న ప్రాంతాల వారికి సైతం ప్రధానిగా సుపరిచితమైన పేరు.. మోడీ. అంతటి ఇమేజ్ ఉన్న ఆయనకు మరో ఆభరణం క్లీన్ ఇమేజ్. కుటుంబ సభ్యుల్ని కూడా దరికి చేర్చని ఆయన మీద నిందలు వేసే సాహసానికి ఎవరూ దిగరు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటమే కాదు.. సంక్షోభ సమయంలో ప్రధాని అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పడుతున్నారు.

కరోనా కేసులు భారీ ఎత్తున నమోదవుతున్న వేళలో.. టీకాల కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పుడు.. ఆ ఇష్యూల్ని క్లోజ్ చేయాల్సింది పోయి.. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అంతేకాదు.. మొన్నటికి మొన్న సీబీఎస్ ఈ నిర్వహించే పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అదే పనిగా డిమాండ్ చేయటం.. చివరకు మోడీ సర్కారు ఆ నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు ఇప్పటివరకు ఉన్న ప్రాధాన్యతల్ని మార్చి.. 25 ఏళ్లక పైబడిన అందరికి కోవిడ్ టీకాలు ఇవ్వాలంటూ ఆమె కేంద్రాన్ని కోరారు. పాతికేళ్లకు పైబడిన అందరికి టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ.. అస్తమా.. షుగర్.. గుండెపోటు.. మూత్రపిండాల వ్యాధులు లాంటి సమస్యలు ఉంటే.. పాతికేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కూడా టీకా ఇవ్వాలని కోరుతున్నారు. నిజానికి.. ఈ డిమాండ్ లో అర్థముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోరలు జాచే కోవిడ్ నుంచి బయటపడాలంటే వీలైనంతవరకు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు వ్యాక్సినేషన్ విషయానికి సంబంధించిన విధివిధానాల్ని వేగవంతం చేయాల్సి ఉంది.

ఓపక్క దేశీయంగా తయారయ్యే వ్యాక్సిన్లను దేశ ప్రజలకు అందించే కంటే.. విదేశాలకు ఎగుమతిచేయటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు. కానీ.. ఇలాంటి విషయాల్లో మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు విమర్శలకు అవకాశం ఇస్తున్నాయి.

మొన్నటివరకు విదేశాలకు టీకాల ఎగుమతిని సమర్థించిన వారు.. దేశంలో భారీ ఎత్తున పెరుగుతున్నకేసుల నేపథ్యంలో.. కేంద్రం టీకా పాలసీని తప్పు పడుతున్నారు. సెలవు తీసుకోకుండా దేశ ప్రజల కోసం అనుక్షణం తపించే మోడీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేత సలహా ఇచ్చే వరకు తెచ్చుకోవటం.. ఆమె చేసే డిమాండ్లకు సానుకూలత వ్యక్తమయ్యే పరిస్థితి రావటం దేనికి సంకేతం మోడీజీ? సోనియా డిమాండ్ చేసే వరకు.. టీకాను పాతికేళ్ల వయస్కుల వారికి ఇవ్వాలని మోడీకి రాలేదెందుకు?