Begin typing your search above and press return to search.

జైట్లీ మరణంతో సోనియా ఎంత ఎమోషన్ అయ్యారంటే?

By:  Tupaki Desk   |   25 Aug 2019 8:17 AM GMT
జైట్లీ మరణంతో సోనియా ఎంత ఎమోషన్ అయ్యారంటే?
X
మాజీ కేంద్రమంత్రి.. ప్రముఖ లాయర్.. రాజకీయ వర్గాల్లో మేధావిగా పేరుప్రఖ్యాతులతోపాటు.. తెర వెనుక కథ నడిపించే విషయంలోనూ.. వ్యూహాల్ని సిద్ధం చేయటంలోనూ మంచి నేర్పున్న నేతగా అరుణ్ జైట్లీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఆయన మాస్ నాయకుడు కానే కాదు.కానీ.. తానున్న పార్టీలో కీలకభూమిక పోషించటమే కాదు.. కీలకాంశాల విషయంలో ఆయన డీల్ చేసే తీరు ఆయన్ను పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు.

జైట్లీ మరణించిన నేపథ్యంలో పార్టీలకు అతీతంగా పలువురు అగ్రనేతలు.. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. జైట్లీ మరణం నేపథ్యంలో ఆయన సతీమణి సంగీతా జైట్లీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక లేఖ రాశారు. కుమారుడు రాహుల్ తో కలిసి వెళ్లిన సోనియా.. జైట్లీ భౌతికకాయానికి నివాళులు అర్పించి.. శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె రాసిన లేఖలో జైట్లీ వ్యక్తిత్వాన్ని.. గొప్పతనాన్ని కీర్తించారు.

భావోద్వేగంతో ఉన్న ఆ లేఖ పలువురిని టచ్ చేస్తోంది. చివరి వరకూ ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడిన గొప్ప నేత అరుణ్ జైట్లీ అని పేర్కొన్నారు. దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయిందన్న విచారాన్ని వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతగా ఆయన్ను కీర్తించారు.

మీ భర్త మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకు అతీతంగా మిత్రుల్ని.. సన్నిహితుల్ని సంపాదించుకున్నారని.. కేంద్రమంత్రిగా.. సుప్రీంకోర్టు న్యాయవాదిగా.. ప్రతిపక్ష నేతగా.. ఆయన ఏ పదవిలో ఉన్నా గొప్ప వాగ్దాటి.. విజ్ఞతను ప్రదర్శించారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ మాటలు ఓదార్పును చేకూర్చలేవని.. ఈ కష్టకాలంలో మీ.. మీ పిల్లల బాధను పంచుకోవటానికి నేనున్నాన్న భరోసా మాత్రం ఇవ్వగలనన్నారు. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మనసుల్ని హత్తుకునేలా ఉన్న సోనియా లేఖ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. సమకాలీన రాజకీయాల్లోనూ ఈ తరహా భావోద్వేగం ఉండటం మంచి పరిణామంగా చెప్పక తప్పదు.