Begin typing your search above and press return to search.

ఏపీ కోసం గొంతెత్తిన సోనియమ్మ

By:  Tupaki Desk   |   17 March 2015 1:06 PM GMT
ఏపీ కోసం గొంతెత్తిన సోనియమ్మ
X
తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించే ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టకేలకు విభజన, ఆ విషయంలో ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు తొమ్మిది నెలలు అయినా ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదంటూ పార్లమెంటు వేదికగా అధికార బీజేపీని ప్రశ్నించారు. ఇటీవలే లేఖరాసిన సోనియా..ఇపుడు స్వయంగా గొంతెత్తారు.

మంగళవారం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్సీ స్థానాలు పెంచేందుకు అనువుగా తెచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై లోక్‌ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ తమ హయాంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ఎన్డీయే ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఆ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.ఈ హామీలు ఆంధ్రప్రదేశ్‌ కు ఇచ్చి తొమ్మిది నెలలు దాటిందని, వీటి అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రధానికి రెండుసార్లు విన్నవించానని చెప్పారు. కావాలనే కేంద్రం ఈ విషయంలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాను రాజ్యసభలో ప్రకటించామని, అయితే ఆ సమయంలో నరేంద్ర మోడీ, బీజేపీ నేత వెంకయ్యనాయుడు స్పందించలేదని విమర్శించారు.

సోనియా వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధీటుగా తిప్పికొట్టారు. పునర్విభజన బిల్లులో పలు లోపాలున్నాయని అన్నారు. వీటిని అతి మేధావులు రూపొందించడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు. విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి అందరూ మద్దతిచ్చారని చెప్పారు. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించిన సోనియాగాంధీ 2014వరకు ఎందుకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల ఆవేదన గ్రహించి స్పందించడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.

మొత్తంగా ఏపీ ప్రయోజనాల కోసం సభా వేధికగా సోనియాగాంధీ గళం విప్పడం ఏపీ ప్రయోజనాల సాధనకు జరుగుతున్న ప్రక్రియలో కొంత వేగాన్ని అందిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా అయినా ఏపీకి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.