Begin typing your search above and press return to search.

మాకు పేప‌ర్ బ్యాలెట్ కావాలి..అవినీతి పెరిగిపోయింది

By:  Tupaki Desk   |   17 March 2018 4:45 PM GMT
మాకు పేప‌ర్ బ్యాలెట్ కావాలి..అవినీతి పెరిగిపోయింది
X
ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలో ఆ పార్టీ రాబోయే ఎన్నిక‌ల శంఖం పూరించింది. పార్టీ నేత‌లంతా భ‌విష్య‌త్ రాజ‌కీయంపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని సోనియా మండిప‌డ్డారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సోనియా పిలుపునిచ్చారు.`40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ చిక్‌ మగ్‌ లూరు నుంచి అఖండ విజయం సాధించి దేశానికి సేవలందించారు. త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది` అని సోనియా ధీమా వ్యక్తం చేశారు. `అందరి ఐక్యత వల్లే పదేళ్లు అధికారంలో ఉండగలిగాం. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. యూపీఏ-1లో చేసిన అభివృద్ధి వల్లే రెండోసారి అధికారంలోకి రాగలిగాం. కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి ఒక్కరి విజయంగా భావించాలి. కాంగ్రెస్ క్షీణిస్తున్న దశలో తాను పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే` అని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్లే బెటర్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎంలు) వద్దు అని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు కావాలంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ద్రువపరించింది. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికల సరళిపై విశ్వసనీయత పెరుగుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఈవీఎంలను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈవీఎంలను ట్యాంపర్ చేయలేమని గత కొన్ని ఏళ్లుగా ఎలక్షన్ కమిషన్ కూడా పేర్కొంటున్నది. ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. ఆ అంశాన్ని మరింత సునిశితంగా పరిశీలించాలని ఆ పార్టీ అభిప్రాయపడింది.