Begin typing your search above and press return to search.

మోడీ గురించి సోనియాకు అలా అర్థమైందా?

By:  Tupaki Desk   |   17 March 2016 4:34 AM GMT
మోడీ గురించి సోనియాకు అలా అర్థమైందా?
X
చీ కొడితే.. ఎంత ముద్దుగా విసుక్కున్నారో చూశారా? అని చెప్పుకునే వాళ్లు కొంతమంది కనిపిస్తారు. నిజానికి ఇలాంటి మాటలు చెప్పుకునే వాళ్లకు బాగుంటాయేమో కానీ.. వినే వాళ్లకు ఏ మాత్రం బాగోవన్న విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లాంటోళ్లు మిస్ అవుతుంటారు. తమ చేతకానితనాన్ని తమ గొప్పతనంగా చెప్పుకోవటం సోనియమ్మకే చెల్లుతుందేమో.

తాజాగా చోటు చేసుకున్న ఘటననే తీసుకుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు కోటి సంతకాల్ని స్వీకరించడానికి మోడీ నో చెప్పటంతో వాటిని పార్టీ అధినేత్రి సోనియమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి మాట్లాడుతూ.. ఏపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతల్ని కలిసేందుకు మోడీ భయపడ్డారని.. అందుకే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం కాంగ్రెస్ అధినేత్రికి అర్థమైన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేని ఒక రాజకీయ పార్టీకి అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని మోడీ అనుకొని ఉండొచ్చు. అందుకే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వకపోవచ్చు. తాము నోరు తెరిచి అడిగినా కూడా ప్రధాని అపాయింట్ మెంట్ కు నో చెప్పే పరిస్థితి.

నిజానికి కాంగ్రెస్ లాంటి పార్టీ నిజంగా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తే ఇవ్వకుండా ఉంటారా? అందులోకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రానికి కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఇలాంటి నేపథ్యంలోనూ.. ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండటం కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. తమ పార్టీ నేతలు అపాయింట్ మెంట్ అడిగితే మోడీ నో అనట తమను తేలిగ్గా తీసుకోవటమేనన్న చేదు నిజాన్ని సోనియమ్మకు తనకు తగ్గట్లుగా చెప్పుకున్న తీరు చూస్తే.. కాంగ్రెస్ అధినేత్రి అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవటం మినహా మరింకేం చేయగలం?