Begin typing your search above and press return to search.

సోనియమ్మ నోట సినిమా డైలాగ్

By:  Tupaki Desk   |   13 March 2016 6:04 AM GMT
సోనియమ్మ నోట సినిమా డైలాగ్
X
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓపక్క చైనా వాడు.. మరోపక్క పాకిస్థానోడు అంటూ విలక్షణమైన ఫ్లోలో దివంగత నటుడు నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ సినీప్రియుడి చెవులో మోగుతూనే ఉంటుంది. దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అప్పుడెప్పుడో అతగాడు చెప్పేసిన మాటనే.. పట్టుకొని పదే పదే చెబుతున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.
తాము తప్ప అధికారంలో ఎవరున్నా సరే.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పే సోనియమ్మ.. తమ హయాంలో జరిగిన దారుణాల్ని.. కుంభకోణాల్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఢిల్లీలోని జమైత్ ఉలేమా ఇ హింద్ అధ్వర్యలో జరుగుతున్న సమావేశానికి లిఖిత పూర్వక సందేశాన్ని పంపిన కాంగ్రెస్ అధినేత్రి.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి పట్ల విపరీతమైన ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న విషయం మీకు తెలుసు. అధికారంలో ఉన్న వారు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా సెక్యులరిజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితుల్లో కులం.. మతం.. రంగు.. జాతి వంటి భేదాలన్నీ మరచిపోయి ప్రజలంతా ఒక్కతాటి పైకి వచ్చేలా చేయటం చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు.

ఇన్ని మాటలు చెప్పిన అమ్మ.. తన కొడుకు ఢిల్లీ జేఎన్ యూ వర్సిటీకి వెళ్లి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భేషరతు మద్దుతు ఇచ్చి రావటం ఏమిటి? పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన వ్యక్తిని సమర్థించటం ఏమిటి? అతడ్ని ఘనంగా కీర్తించినోళ్లకు వత్తాసు పలకటం ఏమిటి? ఇవన్నీ చూసినప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో నెట్టటానికి కారణం ఎవరో అర్థమైందా సోనియమ్మ..?