Begin typing your search above and press return to search.

పార్టీ రుణం తీర్చుకుంటారా ?

By:  Tupaki Desk   |   14 May 2022 5:28 AM GMT
పార్టీ రుణం తీర్చుకుంటారా ?
X
నేతలకు పార్టీ ఎంతో ఇచ్చిందని అందుకనే ఇపుడు పార్టీ రుణం తీర్చుకోవాల్సిన సమయం నేతలకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పిలుపిచ్చారు. రాజస్ధాన్లోని ఉదయ్ పూర్లో మూడురోజుల పార్టీ ఆధ్వర్యంలో చింతన్ శివిర్ సదస్సు మొదలైంది. సోనియా పిలుపు విన్నతర్వాత అసలు సమస్య వచ్చిందే ఇక్కడన్న విషయం మరచిపోయారు. అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన చాలామంది నేతలు చివరకు పార్టీని దెబ్బకొట్టేందుకు సైతం వెనకాడలేదు.

ఆధిపత్యగొడవలు, ముఠా తగాదాలు, అవినీతి, అరాచక పాలనతో జనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం దూరమైపోయింది. చివరకు ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చినపుడు అధికారంలోకి రావటానికి ఏమిచేయాలని సమావేశాలు పెట్టుకుని గగ్గోలు పెడుతోంది. చేతిలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని స్వయంగా కూలగొట్టుకున్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆధిపత్యగొడవలు, గ్రూపు తగాదాల కారణంగానే కమలనాధ్, జ్యోతిరాధిత్యసింథియా మధ్య గొడవలు పెరిగి చివరకు ప్రభుత్వం పతనమైపోయింది.

వాళ్ళ మధ్య గొడవలను నివారించలేకపోవటం సోనియా, రాహుల్ ఫెయిల్యూరనే చెప్పాలి. అధికారంలో ఉన్నపుడు అపరమితమైన అధికారాలను అనుభవించిన చాలామంది నేతలు ప్రతిపక్షంలోకి రాగానే పార్టీని వదిలి వెళ్ళిపోయిన ఘనలు చాలానే ఉన్నాయి.

పార్టీలో పెరిగిపోయిన వృద్ధతరానిదే ఇంకా పెత్తనం సాగుతున్న విషయం సోనియాకు తెలీదా. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వనంతవరకు ఇలాంటి సమస్యలు పరిష్కారం సాధ్యంకావు. ఈ విషయంలోనే రాజస్ధాన్లో ముఖ్యమంత్రి గెహ్లాత్-సచిన్ పైలెట్ మధ్య గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

పార్టీ రుణం తీర్చుకోవాలంటే ముందు వృద్ధతరాన్ని పక్కనపెట్టాలి. ఎందుకంటే వీళ్ళవల్ల ఎలాంటి ఉపయోగంలేదు. వీళ్ళు దేశంలో తిరిగలేరు, తిరగ్గలిగిన యువనేతలను స్వేచ్చగా పనిచేసుకోనివ్వరు. ఓట్లు వేయటానికి జనాలు సిద్ధంగా ఉన్నా వేయించుకోవటానికి పార్టీయే ఇష్టపడటంలేదు.

అన్నింటికాన్నా ముందు రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయాలు చేయాలి. రెండేళ్ళు రాహుల్ జనాల్లో తిరిగితే మిగిలిన నేతలు కూడా తిరుగుతారు. అప్పుడు జనాలు పార్టీవైపు వచ్చే అవకాశముంది. పార్టీ పునరుజ్జీవనానికి ఇదే చివరి అవకాశం అన్నట్లుగా నేతలంతా కష్టపడితేనే ఫలితం ఉంటుంది లేకపోతే పార్టీ భవిష్యత్తును కాలానికి వదిలేయాల్సిందే.