Begin typing your search above and press return to search.

సౌండ్ రాకుండా మరోసారి దిమ్మ తిరిగేలా షాకిచ్చిన సోనియమ్మ

By:  Tupaki Desk   |   7 Sep 2020 11:50 AM GMT
సౌండ్ రాకుండా మరోసారి దిమ్మ తిరిగేలా షాకిచ్చిన సోనియమ్మ
X
ఓడలు బండ్లు కావొచ్చు. అంత మాత్రాన ఓడకు ఉండే సహజ లక్షణం మిస్ కాదు కదా. కాలం కలిసి రాని వేళ.. సీనియర్లు అంతా కలిసి గాంధీ కుటుంబ యువరాజు మీద అస్త్రాల్ని ఎక్కు పెట్టిన వైనం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మార్చిందో తెలిసిందే. గతానికి భిన్నంగా సీనియర్లు వ్యవహరించిన తీరుపై గరం గరంగా ఉన్న సోనియమ్మ.. కాలం గడుస్తున్నా తన కోపం ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేయటం గమనార్హం.

తాజాగా మరోసారి కీలక నేతలకు సౌండ్ రాకుండా దెబ్బేసిన వైనం షాకింగ్ గా మారింది. యూపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. పార్టీకి సంబంధించి ఏడు కమిటీలను నియమించింది సోనియమ్మ. ఈ కమిటీలకు సంబంధించి ఎంపిక చేసిన నేతల్ని చూస్తే.. ఒక విషయం ఇట్టే అర్థమవుతుంది. పార్టీకి క్రియాశీలక నేత.. పూర్తికాలపు అధ్యక్షుడు కావాలంటూ లేఖలో సంతకాలు పెట్టిన ఏ నేతకు అవకాశం లభించకపోవటం గమనార్హం.

యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులుగా వ్యవహరించిన జితిన్ ప్రసాద్ తో పాటు.. యూపీ పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన రాజ్ బబ్బర్ కు సైతం ఏడు కమిటీల్లోని ఏ ఒక్క దానిలో చోటు లభించకపోవటం చూస్తే.. సోనియమ్మ ఎంత సీరియస్ గా ఉన్నారో తెలుస్తోంది. వీరిద్దరే కాదు.. మరో సీనియర్ నేత ఆర్ పి ఎన్ సింగ్ కూడా కమిటీల్లో చోటు దక్కలేదు. అయితే.. సదరు సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టకుండా.. అప్రాధాన్య పోస్టులు అప్పజెప్పి.. ఆ బాధ్యతల్లో బిజీగా ఉన్నారన్న వాదనను వినిపించటం ద్వారా కర్ర విరగకుండా.. పాము చావని రీతిలో నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం.

యూపీ ఎన్నికలకు ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లో చోటు దక్కని జితిన్ ప్రసాద్ కు బ్రాహ్మణ చేతన పరిషత్ బాధ్యతలు అప్పజెప్పాం.. దాన్లో ఆయన తీరిక లేకుండా ఉన్నారని.. ఆర్ పీఎన్ సింగ్ కు జార్ఖండ్ ఇన్ ఛార్జిగా ఉన్నట్లుగా చెప్పటం చూస్తే.. సోనియమ్మ సీరియస్ అయితే.. సీన్ ఎంత సితార అవుతుందో.. అందరికి అర్థమయ్యేలా చేస్తున్నారని చెబుతున్నారు.