Begin typing your search above and press return to search.

స్పీకరమ్మ ఇంటికి అమ్మాకూతుళ్లు వెళ్లారు

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:18 AM GMT
స్పీకరమ్మ ఇంటికి అమ్మాకూతుళ్లు వెళ్లారు
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది సాధ్యం కాదు కూడా. ఈ సత్యాన్ని గ్రహించినోడు సుఖంగా.. ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ వ్యవహారం కూడా అంతే. చేతిలో పవర్ ఉన్నప్పుడు.. రిమోట్ కంట్రోల్ తో దేశాన్ని కంట్రోల్ చేసిన ఆమె.. అది కాస్త చేజారి పోయిన తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకొని మెలగటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. పదేళ్ల పాటు దేశాన్ని సింగిల్ హ్యాండ్ తో ఏలిన ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఒకప్పుడు సోనియమ్మ అపాయింట్ మెంట్ కోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. అంతటి శక్తివంతమైన ఆమె.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండటం తెలిసిందే. సమయానికి తగ్గట్లుగా తనను తాను తీర్చిదిద్దుకోవటం సోనియాకు కొత్తేం కాదు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన ఆమె.. పవర్ లో ఉన్నప్పుడు ఎంత హవా నడిపిస్తారో.. అది లేనప్పుడు అంతే తగ్గి ఉండటం కనిపిస్తుంది.

తాజాగా ఆమె.. ఆమె కుమార్తె ప్రియాంక ఇద్దరూ లోక్ సభ స్పీకర్ ఇంటికి వెళ్లి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. పది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు షురూ అవుతున్న వేళ.. కూతుర్ని వెంటబెట్టుకొని స్పీకరమ్మ ఇంటికి వెళ్లటం అందరి దృష్టి పడేలా చేసింది. అయితే.. ఈ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందే తప్పించి.. మరెలాంటి ప్రత్యేకత లేదని చెబుతున్నారు. ఒకవేళ.. ప్రత్యేక ఉన్నా.. బయటకు చెప్పుకోలేరు కదా.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా సోనియాగాంధీ రాష్ట్రపతి మొదలు ఎవరితోనైనా భేటీ కావటం పెద్ద విషయం కాదు. కానీ.. కూతురు ప్రియాంకా వాద్రాను వెంటబెట్టుకొని స్పీకరమ్మ ఇంటికి వెళ్లటం చర్చగా మారింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ జాతీయత గురించి ప్రశ్నించటం.. అతగాడు భారతీయుడు కాదని.. బ్రిటీషర్ అని.. ఆయన పౌరసత్వానికి సంబంధించి పత్రాలు చూపించటం తెలిసిందే. ఎంపీగా ఉండేందుకు రాహుల్ అనర్హుడంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం తెలిసిందే.

తన వద్దనున్న ఆధారాల్ని తాను రాష్ట్రపతి.. స్పీకర్ కు పంపుతానని.. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన రోజునే.. సోనియమ్మ.. తన కూతుర్ని వెంటబెట్టుకొని స్పీకరమ్మ ఇంటికి వెళ్లటం గమనార్హం. ఇంతకీ.. స్పీకరమ్మతో అమ్మాకూతుళ్ల భేటీ వ్యక్తిగతమా..? లేక.. మరే ఇతర కారణం ఉందా? అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు లభిస్తుందో..?