Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధినేత్రికి అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:56 PM GMT
కాంగ్రెస్ అధినేత్రికి అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
X
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు అనారోగ్యం బారినపడ్డారు. జ్వరం - శ్వాస సంబందిత సమస్యలతో సతమతమవుతున్న సోనియాను ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం సంబంధిత వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోనియాను ఆసుపత్రిలో చేర్చారన్న వార్త విన్నంతనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. పార్టీకి చెందిన కీలక నేతలు ప్రస్తుతం సర్ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లి సోనియా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే యత్నం చేస్తున్నారు.

యూపీఏ2 హయాంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ... లండన్ వెళ్లి చికిత్స తీసుకున్నారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా సోనియా గాంధీ పలుమార్లు అనారోగ్యానికి గురి కావడం, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం మనకు తెలిసిందే. వయసు మీద పడిన నేపథ్యంలోనే పలు రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా సోనియా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోనియాకు అనారోగ్యం కారణంగానే ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత... కాంగ్రెస్ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అయితే రాహుల్ వదిలేసిన బాధ్యతలను తీసుకునేందుకు పార్టీలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో సోనియానే తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించక తప్పలేదు. అయితే తరచూ సోనియా అనారోగ్యానికి గురవుతున్న వైనం పార్టీ శ్రేణులను నిజంగానే కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పక తప్పదు.