నిజమే... మూడేళ్ల నాటి సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మొన్నటి యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న బీజేపీని బలీయమైన శక్తులుగా ఎదిగేలా చేశాయి. ఇప్పటికిప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా... బీజేపీ సత్తా చాటడం ఖాయమని కూడా అన్ని స్థాయిల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ రంగంలోకి దిగిపోయింది.
ఇటీవలి కాలంలొ అనారోగ్య సమస్యలతో బయటకే రావడానికి నానా తంటాలు పడుతున్న ఆ పార్టీ అదినేత్రి, పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన యూపీఏ సర్కారు చైర్ పర్సన్ గా కొనసాగిన సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగిపోయారు. అయినా ఇప్పుడేం ఎన్నికలు ఉన్నాయని సోనియా గాంధీ రంగంలోకి దిగిపోయారనుకుంటున్నారా? బీజేపీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే అవకాశాలున్న రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే సోనియా రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే పక్కా కార్యాచరణతో రంగంలోకి దిగిన సోనియా... పలు ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే పలు పార్టీల కీలక నేతలతో భేటీలు నిర్వహించిన సోనియా.. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయకపోతే జరిగే నష్టాన్ని కూడా వారి ముందు పెట్టినట్లు సమాచారం. ఇప్పటిదాకా సోనియాను కలిసిన నేతలంతా ఆమె ప్రతిపాదనలకు సరేనన్నారే తెలుస్తోంది. ఇక త్వరలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అదినేత్రి మాయావతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ లతో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ నేతలకు చెందిన రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంతో వీరంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న విషయం తెలిసిందే.
సరైన సమయం కోసం వేచి చూస్తున్న వీరంతా.. తమనంతా ఒక్కతాటిపైకి తీసుకువచ్చి బీజేపీపై పోరు సాగించే వారి కోసమే ఎదురుచూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా నుంచి అందిన ఆహ్వానం వీరికి వెయ్యేనుగుల బలాన్నిచ్చిందనే చెప్పాలి. రాష్ట్రపతిని సొంతంగా గెలిపించుకునేంతగా బీజేపీకి బలం లేకపోయిన అంశాన్ని ఆసరా చేసుకుని సోనియా మంచి వ్యూహాన్నే రచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహం విజయం సాధిస్తుందో?... లేదో?... తెలియదు గానీ... బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం సోనియా వ్యూహం ఓ కఠిన పరీక్ష పెట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/