Begin typing your search above and press return to search.

కుతూహ‌ల‌మ్మ‌కు కొడుకు క‌ష్టాలు.. మామూలుగా లేవుగా..!

By:  Tupaki Desk   |   29 Aug 2021 9:30 AM GMT
కుతూహ‌ల‌మ్మ‌కు కొడుకు క‌ష్టాలు.. మామూలుగా లేవుగా..!
X
ఆమె ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. వివాద ర‌హితురాలిగా ఉమ్మ‌డి ఏపీలో పేరు తెచ్చు కున్నారు. అంతేకాదు.. త‌న వాక్చాతుర్యంతో.. కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ల‌ను సైతం మెప్పించార‌నే పేరుంది. ఇక‌, పార్టీ అధిష్టానం ద‌గ్గ‌ర కూడా ఆమెకు మంచి ప‌లుకుబ‌డి ఉంది. ఆమే.. గుమ్మ‌డి కుతూహ‌ల‌మ్మ‌. కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కురాలిగా ఉన్న ఆమె.. ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. మూడున్న‌ర ద‌శాబ్దాలు రాజ‌కీయాల్లో ఉన్నా.. పెద్ద‌గా ఏమీ సంపాయించుకోని నాయ‌కురాలిగా కూడా ఆమెకు పేరుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వ‌యో వృద్ధురాలు కావ‌డంతో.. రాష్ట్ర విభ‌జ‌న తర్వాత‌.. రాజ‌కీయాల‌కు ఒకింత దూరంగానే ఉంటున్నారు. కానీ, విభ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా మారిపోయిన నేప‌థ్యంలో వెంట‌నే ఆమె.. టీడీపీవైపు చూశారు. గ‌తంలో చంద్ర‌బాబుతో ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో 2014 ఎన్నిక‌ల్లో ఆమె.. చిత్తూరు జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తం గా ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ భారీ ఎత్తున పుంజుకుని అధికారంలోకి వ‌చ్చినా.. గుమ్మ‌డి మాత్రం ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె త‌న కుమారుడు హ‌రికృష్న‌ను రంగంలోకి దింపారు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఒప్పించి మ‌రీ.. త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకున్న కుతూహ‌ల‌మ్మ‌. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో.. తొలిసారి అరంగేట్రం చేసిన‌ హ‌రికృష్ణ వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌.. కే. నారాయ‌ణ‌స్వామిపై ఓడిపోయారు. చిత్రం ఏంటంటే.. 2014లో 25 వేల మెజారిటీతో నారాయ‌ణ స్వామి విజ‌యం ద‌క్కించుకుంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇది 45 వేల‌కు ఎగ‌బాకింది. అంటే.. స్వామి దూకుడు పెరుగుతూ వ‌స్తోంది. దీంతో ఓడిపోయినా.. ఫ‌ర్లేదు.. నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ఃగా ఉండాలంటూ.. త‌న కుమారుడికి కుతూహ‌ల‌మ్మ హిత‌వు ప‌లికారు.

అయితే.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. హ‌రికృష్ణ అడ్ర‌స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. నిజానికి ఇంత‌కు మించి.. టీడీపీకి కూడా ఆప్ష‌న్ లేకుండా పోయింది. దీంతో హ‌రికృష్ణ‌ను యాక్టివ్ అవ్వాలంటూ.. స్వ‌యంగా చంద్ర‌బాబు.. ఒక‌టికి రెండు సార్లు హెచ్చ‌రించారు. అయినా.. కూడా హ‌రి.. ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో తాజాగా.. జీడీ నెల్లూరు ఇంచార్జ్ ను మారుస్తూ.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఎస్సీ కాక‌పోయినా.. పార్టీని ప‌రుగులు పెట్టిస్తార‌నే ఉద్దేశంతో చిట్టిబాబు అనే నాయ‌కుడికి .. ఇక్క‌డ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యం తెలిసిన‌.. కుతూహ‌ల‌మ్మ కుమారుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఆమె మాత్రం ఏం చేస్తారు? ఇదీ.. కుతూహ‌ల‌మ్మ‌కు కొడుకు క‌ష్టాలు!