Begin typing your search above and press return to search.

బతికి ఉండగానే తల్లి కి ‘పెద్దకర్మ’ కార్డులు కొట్టించి పంచేశాడు

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:09 AM IST
బతికి ఉండగానే తల్లి కి ‘పెద్దకర్మ’ కార్డులు కొట్టించి పంచేశాడు
X
కని.. పెంచి.. పెద్దవారిని చేసిన తల్లి విషయంలో మరే కొడుకు చేయని దుర్మార్గానికి పాల్పడ్డాడో కొడుకు. తన వద్ద కాకుండా తన తమ్ముడి దగ్గరే ఉంటుందన్న కోపం కానీ మరేదైనా కారణంగా కానీ దాటకూడని లైన్ ను దాటేసి.. ఇప్పుడు పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. ఇతగాడి గురించి తెలిసిన వారంతా తీవ్రస్థాయిలో మండిపడటమే కాదు.. ఇలాంటి వాడిని అస్సలు వదలకూడదన్న మాటను అంటున్నారు. బతికున్న తల్లిని.. తన దగ్గర కాకుండా తమ్ముడి దగ్గర ఉందన్న దుగ్థతో తల్లి మరణించిందని.. పెద్దకర్మ చేస్తున్నాం.. రావాలంటూ కార్డులు కొట్టించి మరీ పంచుతున్నఒక కొడుకు నిర్వాకం తాజాగా బయటకు వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నకిరేకల్ కు చెందిన పోషమ్మకు ఇద్దరు కొడుకులు.. నలుగురు కూతుళ్లు. అందరికి పెళ్లిల్లు అయ్యాయి. చాలాకాలంగా ఆమె తన చిన్న కుమారుడి ఇంట్లోనే ఉంటోంది. ఇలాంటివేళ.. పెద్ద కొడుక్కి ఎందుకంత కోపం వచ్చిందో కానీ.. తన తల్లి పోషమ్మ ఈ నెల 19న మరణించారని.. ఆమె పెద్ద కర్మను అక్టోబరు 28న నిర్వహిస్తున్నామని.. బంధువులంతా రావాలంటూ తన పేరు.. తన భార్య పేరుతో పెద్దకర్మ కార్డులు కొట్టించి.. బంధువులకు పంచటం షురూ చేశాడు. ఈ విషయం తెలిసిన సదరు తల్లి.. కొడుకు చేసిన నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.