Begin typing your search above and press return to search.

పబ్‌ జీ పిచ్చి: తండ్రిని చంపేసి గేమ్ ఆడాడు...!

By:  Tupaki Desk   |   10 Sept 2019 7:00 AM IST
పబ్‌ జీ పిచ్చి: తండ్రిని చంపేసి గేమ్ ఆడాడు...!
X
నేటి యువతని పూర్తిగా బానిసలని చేస్తున్న ఆన్ లైన్ గేమ్ ఏదైనా ఉందంటే అది పబ్‌ జీనే. దీనికి యువత పూర్తిగా బానిసై నిజంగానే ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలని చూస్తూనే ఉన్నాం. తాజాగా పబ్‌ జీ వల్ల మరో దారుణమైన ఘోరం చోటు చేసుకుంది. పబ్‌ జీ ఆడొద్దన్నాడని కన్నా తండ్రినే చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. చంపేసింది కాకుండా రాత్రంతా తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని గేమ్ ఆడాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన శంకరప్ప కుంబర్గా(65) పోలీసు శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అతడి కొడుకు రఘువీర్(25) ఇటీవల పబ్‌ జీ గేమ్‌ కు బానిసయ్యాడు. అయితే ఏ పనీ చేయకుండా రోజూ గదిలో తలుపులు వేసుకుని గేమ్ ఆడుతుండటంతో రఘువీర్ ని శంకరప్ప చాలాసార్లు మందలించాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం పబ్‌ జీ ఆడుతున్న రఘువీర్ ని శంకరప్ప మరోసారి మందలించాడు.

ఇలా గేమ్ ఆడుతూ కూర్చుంటే సంపాదన ఎలాగూ అంటూ తిడుతూ రఘువీర్ చేతిలోని మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అలాగే ఫోన్ నెట్ కూడా ఆఫ్ చేశాడు. దీంతో కోపోద్రోక్తుడైన రఘువీర్ కత్తి తీసుకుని శంకరప్ప తల - కాళ్ళపై దారుణంగా నరికేసాడు. ఇక తీవ్ర రక్తస్రావం కావడంతో శంకరప్ప అక్కడిక్కడే కుప్పకూలి మరణించాడు. ఇక సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ సమాచారంతో హుటాహుటిన సంఘటన స్తలానికి వచ్చి రఘువీర్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు విచారణలో రఘువీర్ దారుణమైన విషయాన్ని చెప్పాడు. తండ్రిని చంపేసి శవం పక్కనే తాను అర్ధరాత్రి వరకు పబ్‌ జీ ఆడినట్లు పోలీసులకు చెప్పాడు. మొత్తానికి పబ్ జీ వల్ల యువత నాశనం అవడంతో పాటు - ఘోరాలు కూడా జరుగుతున్నాయి.