Begin typing your search above and press return to search.

అసలు విషయం బయటపెట్టిన వీర్రాజు

By:  Tupaki Desk   |   7 Aug 2021 6:30 AM GMT
అసలు విషయం బయటపెట్టిన వీర్రాజు
X
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ఇంతకాలానికి సోము వీర్రాజు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపటం కష్టమన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. కాకపోతే ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ అడ్డదిడ్డంగా సమర్ధించుకోవడం విచిత్రంగా ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నేరుగా అంగీకరించకుండా రాష్ట్ర నాయకులు ప్రైవేటీకరణను ఎప్పుడో స్వాగతించారని చెప్పటమే విడ్డూరం.

వీర్రాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని, ఏడాదికి రు. 1300 కోట్లు కేంద్రం భరిస్తోందనే పిచ్చి లెక్కలు చెప్పారు. ఫ్యాక్టరీ నష్టాలన్నీ కేంద్రం వైఖరి వల్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్యాక్టీరికి సొంతగనులు కేటాయించకపోవటం వల్లే నష్టాలు వస్తున్నాయన్న విషయాన్ని కేంద్రం అంగీకరించటం లేదు. అప్పటికీ ఉత్పత్తి పెంచుకుంటూ ఫ్యాక్టరీ ఎప్పటికప్పుడు నష్టాలను తగ్గించుకుంటూ, ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది.

ఇక ప్రైవేటీకరణ విషయాన్ని మాట్లాడుతూ పాల డైరీలు, చక్కెర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులను రాష్ట్ర నేతలు ప్రైవేటుపరం చేశారు కాదా అంటు వీర్రాజు విచిత్రమైన లాజిక్ వినిపించారు. వీర్రాజు చెప్పిన డైరీలు, స్పిన్నింగ్ మిల్లుల, చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటుకు అమ్మేసింది చంద్రబాబునాయుడు. ఎప్పుడో జరిగిన అమ్మకాలను ఇపుడే జరిగిందన్నట్లుగా వీర్రాజు కలరింగ్ ఇస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి విశాఖ ఫ్యాక్టరీ గురించి మాట్లాడమంటే ఎప్పుడో జరిగిన ప్రైవేటీకరణ గురించి మాట్లాడటంలో అర్ధమేలేదు.

సరే ఎలాగైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని కనీసం ఇప్పటికైనా వీర్రాజు అంగీకరించారు. ఇంతకాలం ఇదే విషయమై వీర్రాజు అండ్ కో ఎన్ని డ్రామాలాడింది అందరు చూసిందే. ఒకవైపు ప్రైవేటీకరణ వైపు కేంద్రం అడుగులు వేస్తున్నా, పార్లమెంటులో ప్రకటనలిస్తున్నా వీర్రాజు అండ్ కో మాత్రం అలాంటిదేమీ లేదని జనాలను మభ్యపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో క్లారిటి వచ్చినట్లుంది. అందుకనే చివరకు చేసేదిలేక ప్రైవేటీకరణను అంగీకరించారు.