Begin typing your search above and press return to search.

అచ్చెన్నకు పంచ్ వేసిన సోము వీర్రాజు

By:  Tupaki Desk   |   5 Feb 2021 8:30 AM GMT
అచ్చెన్నకు పంచ్ వేసిన సోము వీర్రాజు
X
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నా.. ఆ పార్టీ నేతలు చేసే చిత్రమైన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించే నేతల్లో ఏపీ బీజేపీ రాష్ట్ర రథసారధి సోము వీర్రాజు ఒకరు. స్థాయికి మించిన వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్టు అయ్యే తత్త్వం ఆయనలో ఎక్కువే. ఇటీవల జరిగిన దాడి కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఆవేశంతో పోలీసుల మీదా.. ఏపీ ప్రభుత్వం మీదా నోరు పారేసుకోవటం తెలిసిందే.

అచ్చెన్నను అరెస్టు చేసి.. కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించిన సమయంలో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీ అధినేత చంద్రబాబును అడిగి మరీ తాను రాష్ట్ర హోం మంత్రి పదవి తీసుకుంటానని.. తనను జైలుకు పంపిన వారిపై అంతకంతకూ బదులు తీర్చుకుంటానని ఒకింత శపధం తరహాలో వ్యాఖ్యలు చేశారు.

దీనిపై తాజాగా రియాక్టు అయ్యారు సోము వీర్రాజు. వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ.. ‘నిన్న ఎవరో ఒకాయన నేనే ఈ రాష్ట్రానికి హోం మంత్రిని అవుతానని అంటున్నాడు. ఎవరికి హోం మంత్రివి అవుతావయ్యా.. చంద్రబాబు హోంకి హోం మంత్రివి అవుతావా’ అంటూ సోము ఎద్దేవా చేశారు. బీసీలను సీఎంచేసే దమ్ము బీజేపీకి ఉందన్న ఆయన.. ఎవర్నో ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్రంలో తాము అధికారంలోకి రావాలనుకోవటం లేదన్నారు. అనవసరమైన వ్యాఖ్య చేసిన అచ్చెన్నకు ఘాటు సమాధానాన్ని సోము ఇచ్చారని చెప్పక తప్పదు.