Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా ప్ర‌జ‌ల‌కే ఇష్టం లేద‌ట

By:  Tupaki Desk   |   11 April 2015 10:29 AM GMT
ప్ర‌త్యేక హోదా ప్ర‌జ‌ల‌కే ఇష్టం లేద‌ట
X

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పార్టీల రంగుని బ‌య‌ట‌పెడుతోంది. తాము ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టించామ‌ని అయినా బీజేపీ ఎందుకు ఆ హోదా ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తోంది. హామీ మాత్ర‌మే ఇచ్చారు త‌ప్ప విభ‌జ‌న బిల్లులో చేర్చ‌నందువ‌ల్లే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని బీజేపీ మండిప‌డుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని టీడీపీ కోరుతుండ‌గా...అవును అంటూ వైసీపీ సైతం మ‌ద్ద‌తిస్తోంది. తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదాపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

విశాఖ‌ప‌ట్ట‌ణంలోని బీజేపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ప్రజలకు ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ అనవసరంగా రచ్చ చేస్తోంది...అందుకు తోడుగా మీడియా మభ్యపెడుతోందన్నారు. విశాఖ‌లోని ఏ డివిజ‌న్‌కు అయినా వెళ్లేందుకు తాను సిద్ధ‌మ‌ని, అక్క‌డ ప్ర‌జ‌ల‌తో బీజేపీ స‌భ్య‌త్వం చేయిస్తాన‌ని, ఆ స‌మ‌యంలో ప్రత్యేక హోదాపై ప్రజలకు ఆసక్తి లేదని నిరూపిస్తానని సోమువీర్రాజు సవాల్‌ విసిరారు. అక్క‌డిక‌క్క‌డే ప్ర‌త్యేక హోదాపై ఎవ‌రు వివాదం చేస్తారో తెలిసిపోతుంద‌ని చెప్పారు. విశాఖ‌లోనే కాదు....ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు వెళ్లినా.. ఇదే అభిప్రాయం తేలుతుంద‌ని చెప్పారు. త‌మ పార్టీలో వేల‌మంది స‌భ్యులుగా చేరుతున్నార‌ని, అందులో ఏ ఒక్క‌రు కూడా ప్ర‌త్యేక హోదా కోసం ఆస‌క్తి లేద‌ని తేల్చారు.

అయితే...ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక హోదా ఆలోచ‌న ఉందని, వారి వ‌ద్ద‌కు వెళ్లేందుకు, వారి మ‌నోభావాల‌ను తెలుసుకునేందుకు సిద్ధ‌మ‌ని మీడియా ప్ర‌తినిధులు అన‌టంతో వీర్రాజు మాట‌మార్చారు. తాను అలా అన‌లేద‌ని వివాదాన్ని అక్క‌డే స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. రాష్ర్ట విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి న్యాయం చేయాల‌ని కోరిందే బీజేపీ అని, ఆ స‌మ‌యంలో టీడీపీ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని ఉన్నారు త‌ప్పితే ఒక్క‌రు కూడా త‌మ పార్టీ ఎంపీ వెంక‌య్య నాయుడుకు మ‌ద్ద‌తుగా ముందుకువెళ్ల‌లేదని మండిప‌డ్డారు.

వీర్రాజు వ్యాఖ్య‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణం అవుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్రం ప్ర‌త్యేక హోదాపై ఉద్దేశ‌పూర్వ‌క‌ ఆల‌స్యం చేస్తున్న ప‌రిస్థితుల్లో బీజేపీ నేత‌లు ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని వారు చ‌ర్చించుకుంటున్నారు. బీజేపీ మ‌నోభావాల‌ను బ‌య‌ట‌పెట్టేలా వీర్రాజు మాట్లాడారా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.