Begin typing your search above and press return to search.

టీడీపీపై వీర్రాజు సెటైర్లు పేలాయే!

By:  Tupaki Desk   |   3 Feb 2018 11:44 AM GMT
టీడీపీపై వీర్రాజు సెటైర్లు పేలాయే!
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ శాస‌న‌మండ‌లిలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు మీడియా ముందుకు వ‌చ్చారంటే... బీజేపీ మిత్ర‌ప‌క్షం - ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి నిజంగానే చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే చాలా సార్లు బ‌హిరంగంగానే టీడీపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన వీర్రాజు... చంద్ర‌బాబు పాల‌న‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ మిత్ర‌పక్షంగానే ఉన్నా... టీడీపీపై ఆయ‌న త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఏనాడూ వెన‌క‌డుగు వేయ‌లేద‌నే చెప్పాలి. ఏపీలో కొన‌సాగుతున్న పాల‌న పూర్తిగా అవినీతిమ‌య‌మై పోయింద‌ని గ‌తంలో వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తాజాగా మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చిన వీర్రాజు... ఈ ద‌ఫా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్‌ లో కీల‌క శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎంపీలుగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు - టీజీ వెంక‌టేశ్... మొత్తంగా కేంద్ర బ‌డ్జెట్‌ పై విమ‌ర్శ‌లు సంధిస్తున్న ప్ర‌తి టీడీపీ నేత‌ను టార్గెట్ చేసుకుని త‌న‌దైన శైలి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్ప‌టిదాకా కేంద్రం ఇచ్చిన నిధుల‌తో ఏ మాత్రం ప‌నులు వెల‌గ‌బెట్టారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులే రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు... మొత్తం ప్రాజెక్టు ప‌నుల‌ను కేంద్రానికే అప్ప‌గిస్తామ‌ని చెప్పిన మాట‌ను ప్ర‌స్తావించిన వీర్రాజు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర‌ బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించారు. మంత్రిగా ఉన్న‌ నారా లోకేష్ కు ఇప్ప‌టిదాకా 19 అవార్డులు వ‌చ్చాయ‌ని చెప్పిన వీర్రాజు... ఆ అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా? అని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీదే అని చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం టీడీపీకి, ఆ పార్టీ నేత‌ల‌కు సరికాదని కూడా ఆయ‌న సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేశ్, రాయపాటి సాంబశివరావులు విమర్శలు గుప్పించడాన్ని వీర్రాజు తప్పుబట్టారు.

మోదీది పేదల ప్రభుత్వమని చెప్పిన వీర్రాజు... వ్యాపారాలు చేసుకునే టీజీ - రాయ‌పాటి లాంటి ఎంపీల కోసం పని చేసే ప్రభుత్వం కాదని చెప్పారు. పొగాకు బండిల్స్ లో రాళ్లు నింపి - చైనాకు ఎగుమతి చేసిన చరిత్ర రాయపాటిదని... అలాంటి వ్యక్తి కూడా మోదీని విమర్శిస్తారా? అంటూ వీర్రాజు ఓ రేంజిలో ఫైర‌య్యారు. కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చక్రం తిప్పిన మాట వాస్తవమేనని వీర్రాజు చెప్పారు. అయితే నాడు కాంగ్రెస్ మద్దతుతోనే నాడు కేంద్రంలో చంద్ర‌బాబు చక్రం తిప్పారని, ఇద్దరు వ్యక్తులను ప్రధానమంత్రులను చేశారని వీర్రాజు అన్నారు. మళ్లీ అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఇప్పుడు టీజీ - రాయ‌పాటిలు భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. అది సాధ్యం కాద‌ని వారిద్ద‌రూ గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వీర్రాజు హెచ్చ‌రించారు. మొత్తంగా చంద్ర‌బాబు స‌హా.... మొత్తం టీడీపీ నేత‌ల‌ను వీర్రాజు క‌లిపి కొట్టేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.