Begin typing your search above and press return to search.

బాబు పెత్త‌న‌మేంటంటున్న వీర్రాజు!

By:  Tupaki Desk   |   1 Feb 2017 5:09 AM GMT
బాబు పెత్త‌న‌మేంటంటున్న వీర్రాజు!
X
టీడీపీ స‌ర్కారుపై ఆ పార్టీ మిత్రప‌క్షం బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. కేంద్రంలోనే కాకుండా, ఇటు రాష్ట్రంలోనూ మిత్ర‌ప‌క్షంగానే ఉన్న టీడీపీపై వీర్రాజు గ‌తంలోనూ ప‌లుమార్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా నిన్న బాబు స‌ర్కారు పాల‌నా కేంద్రం అమ‌రావ‌తి వేదిక‌గా ఆయ‌న మ‌రోమారు ఫైర‌య్యారు. టీడీపీ నేత‌ల‌ను ప‌క్ష‌పాతులుగా అభివర్ణించిన వీర్రాజు... కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల్లోనూ త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు టీడీపీ ప్ర‌భుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌నతో పాటు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయినా కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే విష‌యంలో గ్రామ స‌భ‌ల స్థానంలో జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఎందుకు నియ‌మించారంటూ కూడా ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

కేంద్రం ప్ర‌క‌టించిన ప‌థ‌కాల అమ‌లును టీడీపీ జ‌న్మభూమి క‌మిటీలకు అప్ప‌గించ‌డ‌మేమిటంటూ కూడా వీర్రాజు ఓ రేంజిలో ఫైర‌య్యారు. టీడీపీ నేత‌ల వైఖ‌రితో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు నానా ఇబ్బందులు ప‌డ‌ట‌మే కాకుండా... ఏ ఒక్క ప‌థ‌కానికి కూడా నోచుకోకుండా పోతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఏపీకి కేంద్రం 1.45 ల‌క్ష‌ల గృహాల‌ను కేటాయిస్తే.. వాటిలో ఒక్క‌టంటే ఒక్క ఇల్లును కూడా బీజేపీ కార్య‌కర్త‌ల‌కు ఇచ్చేందుకు టీడీపీ నేత‌లు సిద్ధంగా లేర‌ని, ఇదెక్క‌డి అన్యాయ‌మ‌ని ఆయ‌న ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. ఇల్లే కాకుండా క‌నీసం పింఛ‌ను కోసం వెళ్లినా... త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మొండిచెయ్యే మిగులుతోంద‌న్నారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ కేవలం టీడీపీకి చెందిన వారికే ద‌క్కుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అస‌లు మా ప్ర‌భుత్వంలో బీజేపీకి ఇచ్చేదేంది? ఇల్లు కాదు, పింఛ‌ను కాదు... ఏ ఒక్క‌టి కూడా ఇచ్చేది లేద‌ని కూడా త‌మ కార్య‌క‌ర్త‌ల ముఖం మీదే టీడీపీ నేత‌లు చెబుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీని టీడీపీ నేత‌లు మిత్రప‌క్షంగా ఏ కోశానా ప‌రిగ‌ణించ‌డం లేద‌ని, అలాంట‌ప్పుడు మ‌నం కూడా వారిని మిత్ర‌ప‌క్షంగా ఎందుకు చూడాల‌ని కూడా ఆయ‌న త‌న పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడికి చుర‌క‌లంటించారు. మ‌రి వీర్రాజు ఆవేద‌న చంద్ర‌బాబుకు వినప‌డిందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/