Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై సోము వీర్రాజు ఫైర్‌

By:  Tupaki Desk   |   12 May 2016 11:29 AM GMT
చంద్ర‌బాబుపై సోము వీర్రాజు ఫైర్‌
X
మిత్ర‌బంధం బాగున్నప్పుడు తప్పులు ఉన్నా క‌నిపించ‌వు.. కానీ ఆ బంధం ఒక్క‌సారి విడిపోతే అప్పుడు ఆ త‌ప్పుల‌న్నీ వెలుగులోకి వ‌స్తాయి! ఇప్పుడు టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. హోదా విష‌యంలో బీజేపీ మాట‌త‌ప్పింద‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. హోదా కంటే ఎక్కువే ఇస్తామ‌ని చెప్పినా.. టీడీపీ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డంపై బీజేపీ మండిపడుతోంది. ఇక తెదేపా - భాజపాలు లాంఛనంగా యుద్ధ ప్రకటన చేసినట్లే వ్యవహరిస్తున్నాయి. తెదేపా నేతల విమర్శలకు భాజపా నేతలు కూడా గట్టిగా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు.

జగన్ తరువాత చంద్రబాబుని విమర్శించేవారిలో బీజేపీ నేత‌ సోము వీర్రాజు కూడా ఒకరు. జగన్ శత్రుపక్షానికి - సోము వీర్రాజు మిత్రపక్షానికి చెందడం ఒక్కటే తేడా తప్ప వారిద్ద‌రికీ చంద్రబాబుపై స‌ద‌భిప్రాయం లేద‌నే సంగతి వారి మాటల్లో బయటపడుతూనే ఉంటుంది. మ‌రోసారి సోము వీర్రాజు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అంతేగాక ప్ర‌త్యేక‌హోదాపై చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేస్తూ.. ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు.

ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో మళ్ళీ యుద్ధం మొదలయినప్పటి నుంచి నిన్నటి వరకు సోము వీర్రాజు నోరు విప్పలేదు. కానీ కావలి పట్టణంలో ఆయన మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా ఏమయినా సంజీవినినా? హోదా పొందిన రాష్ట్రాలు కూడా ఇంకా వెనకబడి ఉన్నాయి. హోదా వస్తుందా రాదా అనే దాని కంటే రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేదే చాలా ముఖ్యం,’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నోసార్లు అన్నారు. మళ్ళీ ఆయనే ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోతుందన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకే విషయంపై ఆయన ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్న మాట వాస్తవమా కాదా? కేంద్ర ప్రభుత్వం సహాయం పొందుతూనే ముఖ్యమంత్రి దానిపై నిందలు వేయడం సబబు కాదు,” అని అన్నారు.

ఏదేమైనా వీర్రాజు ముందునుంచి టీడీపీ - చంద్ర‌బాబు పేరు చెపితేనే విరుచుకుప‌డుతున్నారు. ఆయన తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీతో యుద్ధానికి గంట మోగించిన‌ట్టే అన్న వ్యాఖ్య‌లు ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.