Begin typing your search above and press return to search.

ఆంధ్రజ్యోతి ఆర్కేకు సోము మార్కు ఓపెన్ లెటర్

By:  Tupaki Desk   |   22 Aug 2020 2:00 PM GMT
ఆంధ్రజ్యోతి ఆర్కేకు సోము మార్కు ఓపెన్ లెటర్
X
ఏపీలోని మిగిలిన రాజకీయ నేతలకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కాస్త తేడా ఉందని చెప్పాలి. ఎవరి మీదనైనా సరే.. వెనకా ముందు చూసుకోకుండా పంచ్ లు వేసేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఏ చిన్న అవకాశం వచ్చినా.. వదిలిపెట్టని ఆయన తీరు పుణ్యమా అని తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. తాజాగా ఆయన గురి.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే మీదకు మళ్లింది. ప్రతి ఆదివారం తన పత్రికలో భారీ వ్యాసాన్ని రాయటం ఆర్కేకు అలవాటు.

సమకాలీన రాజకీయాలపై సునిశిత విశ్లేషణ అంటూ.. తన రాతల గురించి తన టీవీల్లో ప్రచారం చేసుకునే ఆయన.. తానేం చెప్పాలనుకుంటాడో చెప్పేస్తుంటారు. అందుకు.. ఏ మాత్రం వెనుకాడరు. ఈ రోజు తన వ్యాసంలో బీజేపీ నేత జీవీఎల్ పై కాసిన్ని సటైర్లుతో పాటు.. సలహాలు వేశారు. అలాంటి నేతను బీజేపీ అధినాయకత్వం కట్టడి చేస్తే మంచిదన్న సూచనను చెప్పారు. రాజకీయంగా ఏపీలో ఎదగాలని తపిస్తున్న సోముకు.. ఆర్కే వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు.ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఓపెన్ లెటర్ రాశారు.

మీ పత్రికలో మీరు మీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పేశారు కాబట్టి.. స్పందనను సైతం నేను ఓపెన్ గానే చెప్పేయదలుచుకున్నా.. అన్యదా భావించొద్దంటూ తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఆర్కే విశ్లేషణపై సోము వీర్రాజు ఎలా రియాక్ట్ అయ్యారు.. ఆయనేమన్నారు అన్నది దానికి ఆయన మాటల్నే యథాతధంగా చెప్పేస్తే..

‘ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు.’

‘గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. దీని వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది.’

‘మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం’

‘మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను’ అని పేర్కొన్నారు. సోము తీరు చూస్తుంటే.. మీడియా అన్నాక.. ఎవరికి వారు తమకు తోచిన విశ్లేషణను చేస్తుంటారు. మరి.. సోము అందరి విశ్లేషణను ఇదే తీరులో విమర్శిస్తూ పోతారా?