Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స్కెచ్‌ తో టీడీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ

By:  Tupaki Desk   |   17 April 2017 4:43 PM GMT
ప‌వ‌న్ స్కెచ్‌ తో టీడీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ
X

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మిత్ర‌ప‌క్షంగా 2014 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య ఆ దోస్తీ ఒకింత త‌గ్గిపోయి గిల్లిక‌జ్జాలు - విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీని అవ‌కాశం దొరికిన‌ప్పుడల్లా లెఫ్ట్ రైట్ తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వీర్రాజు స్పందిస్తూ ప‌వ‌న్ తీరు క‌రెక్టేన‌ని చెప్పారు. అయితే త‌న పంథాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మార్చుకోవాల్సి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి చూసి పవన్ తమకు మద్దతు పలుకుతారని భావిస్తున్నామని వీర్రాజు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఫార్ములాతోనే తాము కూడా మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ పార్టీ - ప్ర‌భుత్వానికి సంబంధించిన‌ ఏ అంశం పై అయినా ప్రశ్నించవచ్చునని సోము వీర్రాజు అన్నారు. అయితే తాము సైతం మిత్ర‌ప‌క్ష‌మైన తెలుగుదేశం ప్ర‌భుత్వం విషయంలో ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాల‌ను ప్ర‌శ్నిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు. రాష్ట్రంలో నెల‌కొన్న అవినీతి, ప్ర‌జా స‌మ‌స్యలు ప‌రిష్కారం కాక‌పోవ‌డం, ఇత‌ర‌త్రా అంశాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ‌తాన‌ని వీర్రాజు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/