Begin typing your search above and press return to search.

జగన్ కే బీజేపీ మద్దతు... వీర్రాజే సాక్ష్యం

By:  Tupaki Desk   |   22 Jan 2020 1:44 PM GMT
జగన్ కే బీజేపీ మద్దతు... వీర్రాజే సాక్ష్యం
X
ఏపీకి మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారు ప్రతిపాదించిన వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమేనని చెప్పాలి. ఎందుకంటే... ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు... వికేంద్రీకరణకు తమ పార్టీ స్వాగతిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపని శాసనమండలి సాక్షిగా వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్లుగా జగన్ సర్కారు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని జగన్ కంటే ముందే తామే ప్రతిపాదించామని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పామని, ఆ విషయాన్ని తాము మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామని కూడా వీర్రాజు కుండబద్దలు కొట్టారు.

బుధవారం నాటి శాసనమండలి సమావేశాలకు హాజరైన సందర్భంగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గానీ, అధికారం గానీ, అభివృద్ధి గానీ... పేరు ఏదైనా దాన్ని వికేంద్రీకరించాలనే తాము కోరుకుంటున్నామని వీర్రాజు మండలిలో సంచలన ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు ఏఱ్పాటు చేయాలన్న ఆలోచనను తాము ఇదివరకే చేశామని చెప్పిన వీర్రాజు... దానిని తమ పార్టీ విడుదల చేసిన కర్నూలు డిక్లరేషన్ లో పొందుపరచామని తెలిపారు. తమ ఆలోచనా ధోరణికి అనుకూలంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లులో ప్రాంతీయ అభివృద్ది బోర్డుల అంశం కూడా ఉందన్న విషయాన్ని కూడా వీర్రాజు ప్రత్యేకంగా గుర్తు చేశారు.

మొత్తంగా జగన్ సర్కారు ప్రతిపాదించిన వికేంద్రీకరణకు బీజేపీ అనుకూలమేనని, జగన్ నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని తెలిపి వీర్రాజు నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని వీర్రాజు... చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు... నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకరించినా... దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని కూడా వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు అమరావతిలో నిర్మించిన బిల్డింగులన్నీ తాత్కాలికమైనవేనన్న విషయాన్ని మరువరాదని కూడా వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా వికేంద్రీరణ దిశగా సాగుతున్న జగన్ సర్కారుకు వీర్రాజు వ్యాఖ్యలు కొండంత బలం ఇచ్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.