హెడ్డింగ్‌లో మేం చెప్పినట్లే చెప్పలేదు కానీ.. మొత్తంగా ఈ ఉదంతాన్ని వింటే ఇది నిజమనిపించక మానదు. ఆంధ్రోళ్లలో లేనిపోని ఆశలు రేపి.. అంతలోనే తుంచేసిన వైనానికి సంబంధించి ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఎంత నష్టం జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
హోదా విషయంలో బీజేపీ.. టీడీపీలు తాము ఇచ్చిన హామీల్ని కాలానికి వదిలేసి.. ఇప్పుడు హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినట్లుగా చెబుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన సోము వీర్రాజు.. హోదాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా తెలుసని.. అందుకే బిల్లులో చేర్చలేదన్నారు. ఈ విషయం వెంకయ్యకు కూడా తెలుసన్నారన్నారు. ఈ మాటలే నిజమైతే.. హోదా గురించి తాను ముందు ప్రస్తావించానని.. తానే ఒప్పించానని వెంకయ్య మాటల్ని ఎంతగా నమ్మాలో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
ఒకవేళ.. హోదా రాదని తెలిసినా.. వెంకయ్య ఊరుకున్నారంటే.. ఆంధ్రుల్ని ఆయనెంతో మోసం చేశారని చెప్పాలి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తానని వెంకయ్య తనకు తానుగా చెప్పటం అంటే.. ఆంధ్రోళ్లను తప్పు దారి పట్టించేందుకు కుట్ర పన్నారని చెప్పక తప్పదు.
సోము వీర్రాజు మరో మాటను కూడా చెప్పారు. హోదా రాదన్న విషయం వెంకయ్యకు తెలిసినా మౌనంగా ఉండటానికి కారణం.. సీమాంధ్రులు భావోద్వేగాల్లో ఉండటమేనని చెప్పారు. ఎమోషనల్ గా ఉన్న వేళ.. అసలు నిజాన్ని చెబితే తట్టుకోలేరన్న ఉద్దేశంతో వెంకయ్య మౌనంగా ఉన్నట్లుగా వీర్రాజు కవరింగ్ చేయటం చూస్తే..ఆంధ్రోళ్లను మన్మోహన్ మాత్రమే కాదు.. అంతకు మించిన ఎక్కువ మోసం కమలనాథులు చేసినట్లుగా చెప్పక తప్పదు. తప్పు చేయటమే కాదు.. దాన్ని చెప్పుకుంటున్న బరితెగింపును చూస్తే ఆంధ్రోళ్ల సత్తా మీద కమలనాథుల్లో చాలానే క్లారిటీ ఉన్నట్లుగా కనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/