Begin typing your search above and press return to search.

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 175

By:  Tupaki Desk   |   9 Aug 2020 11:40 AM IST
సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 175
X
ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు వ్యవహారశైలిపై సొంత పార్టీలోని సీనియర్లు - కొత్త నేతల్లోనూ భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చి రావడంతో ఆయన రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లు - ఇతరులను కలిసి ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు చేయకుండా.. ఇక్కడి వారిని ఎవ్వరినీ పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లి చిరంజీవి - పవన్ కళ్యాణ్ ను కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సొంత సామాజికవర్గానికి చెందిన ఇతర పార్టీ నేతలకు ఇచ్చిన గౌరవం.. సొంత పార్టీ నేతలకు ఇవ్వరా అన్న ఆవేదన బీజేపీ నేతల్లో సాగుతోందట.. ఈ క్రమంలోనే వారితోనే పొత్తుతో సోము వీర్రాజు వెళతారా అన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది.

రాబోయే 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. కానీ అంతకంటే ముందే జమిలి ఎన్నికలు వస్తే బీజేపీ ముగ్గురు కాపు నేతల సారథ్యంలో ఏపీలో బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. బీజేపీ తరుఫున సోము వీర్రాజుకి 75 సీట్లు - చిరంజీవి కొత్త పార్టీకి 50 సీట్లు - జనసేన పవన్ కళ్యాణ్ కు 50 సీట్లు పంచుకొని పోటీచేస్తారు అంట అని సోషల్ మీడియాలో క్రిటిక్స్ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

సోము వీర్రాజు బీజేపీని బలోపేతం చేస్తున్నాడా? లేక కులాన్ని బలోపేతం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని రాయలసీమ బీజేపీ రెడ్డి నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డులో తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశాడట.. బీజేపీ అధ్యక్షుడిగా వచ్చి రెండు రోజులు కాలేదు అప్పుడే అతడి మీద పార్టీలో వ్యతిరేకత ఏర్పడిందని అంటున్నారు. అది ఇప్పటికిప్పుడు బయటపడకుండా నేతలు గమ్మున ఊరుకున్నారనే టాక్ నడుస్తోంది.