Begin typing your search above and press return to search.

తిరుపతి లడ్డూకి మోడీ పడిపోతున్నారా...?

By:  Tupaki Desk   |   11 Jun 2023 5:00 AM GMT
తిరుపతి లడ్డూకి మోడీ పడిపోతున్నారా...?
X
కేంద్రంలో ప్రధాని గా తొమ్మిదేళ్ళుగా అప్రతిహతంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. అంతర్జాతీయ స్థాయి లో సైతం చాలా మంది నేతల వద్ద మార్కులు కొట్టేస్తూ మంచి పేరు సాధిస్తున్న మోడీ, రాజకీయంగా గండర గండగా పేరు గడించిన మోడీ కేవలం జగన్ ఇచ్చే తిరుపతి లడ్డూ కు పడిపోతున్నారా. ఆయన అంతటి అమాయకంగా ఉన్నారా.

ఏమో ఈ మాటలు వింటే చిత్రంగా ఉంటాయి కానీ అన్నది ఎవరో కాదు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు. శ్రీకాళహస్తి లో జరిగిన బీజేపీ సభలో వీర్రాజు మాట్లాడుతూ ప్రతీ వారం ఢిల్లీ వెళ్తూ సీఎం జగన్ ప్రధాని మోడీ కి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో, తిరుపతి లడ్డూ ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు.

మోడీ కూడా జగన్ని నమ్మి ఏపీ కి ఎన్నో నిధుల ను ఇస్తున్నారని, అయితే ఏపీ కి వచ్చిన తరువాతనే జగన్ తన ప్రతాపం చూపిస్తున్నారని, కేంద్రం ఇచ్చిన ఇళ్ళు, బియ్యం నిధులు పధకాల మీద తన స్టిక్కర్, తన పార్టీ రంగూ వేయించుకుంటూ బీజేపీ చేసిన మేలుని పూర్తిగా మరచిపోయారని అంటున్నారు. కేవలం రాజకీయం కోసం వైసీపీ నేతలు దిగజారి పోతున్నారని ఆయన విమర్శించారు.

ఏపీ లో పేదల ఇళ్ళ కోసం కేంద్రం లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తూంటే ఏపీ సర్కార్ వాటి ని తన ఇళ్ళుగా చెప్పుకోవడం దారుణం అంటున్నారు సోము. జగన్ మీద ఈ మీటింగు లో పెద్ద ఎత్తున సోము వీర్రాజు ఆరోపణలు చేసారు. అంతే కాదు, ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోయి ప్రజలను అప్పులో ఊబి లోకి నెట్టిందని మండిపడుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే సోము వీర్రాజు ది అమాయకత్వం కాకపోతే మోడీ ఏపీ ప్రభుత్వానికి జగన్ కి ఎందుకు పడిపోతారు అని అంటున్నారు. కేంద్రం తనకు అవసరం అయినపుడల్లా వైసీపీ ఎంపీల మద్దతు తీసుకుని కీలకమైన బిల్లుల ను నెగ్గించుకుంటోందని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వైసీపీ మద్దతు తీసుకుని గెలిచిందని గుర్తు చేస్తున్నారు.

రాజకీయా లో ఎవరికి ఎవరూ పడేది ఉండదని అంటున్నారు. ఇక జగన్ మీద ప్రేమ తో కాదు ఏపీ మీద అభిమానంతో నిధుల ను ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే చేత్తో ఏపీ ప్రజలు కోరుకున్నవి అన్నీ ఇస్తే ఈ కంఠ సోష లేకుండా బీజేపీ కమలం పువ్వు గుర్తుకే జనాలు ఓట్లేస్తారు కదా అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మోడీ మంచోడు అమాయకుడు, కేంద్రం ఏపీ కి ఎంతో చేసింది అని బీజేపీ నేత్లు చెప్పడం కాదని, ప్రజలు అనుకోవాలని ఆ సంగతి కమలనాధుల కు అర్ధం కాకపోవడమే పొలిటికల్ ట్రాజడీ అంటున్నారు.